ఎపి రాజధాని గ్రామాల్లో నారాయణ: భూమి చదును
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం సమీకరించిన 28వేల ఎకరాల భూముల్లో సర్వే పూర్తి చేశామని మంత్రి నారాయణ తెలిపారు. రాజధానికి భూములిచ్చిన రైతుల ఇళ్లకు వెళ్లి కౌలు పరిహారం చెల్లిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
రుణమాఫీపై బ్యాంకర్లు, రైతులతో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు భేటి అయ్యారని, ఈ నెల 25వ తేదీలోగా రుణమాఫీ సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి చెప్పారు. భూములను చదును చేసే రైతులకు పత్తికి ఎకరానికి రూ.500, మొక్కజొన్నకు రూ.1000 అందజేస్తామని మంత్రి నారాయణ వివరించారు.

కాగా, ఏపీ రాజధాని నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. రాజధాని గ్రామాల్లో మంత్రి నారాయణ పర్యటిస్తూ దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు. చంద్రబాబు సూచన మేరకు రాజధానిలోనే ఉండి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం మంగళగిరి మండలం నవ్వులూరు, పురవెల్లు గ్రామాల్లో భూమి చదును చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
మంగళవారం ఉదయం కొద్దిపాటి వర్షం కురిసినప్పటికీ దాన్ని లెక్కచేయకుండా నారాయణ భూమిని చదును చేసి రైతులలో ఉత్తేజాన్ని నింపారు. మంగళగిరి మండలం కుర్రకళ్లు, తుళ్లూరు మండలం ఐనవోలు, వెలగపూడి గ్రామాల్లో పనులను నారాయణ పర్యవేక్షిస్తున్నారు.












Click it and Unblock the Notifications