ఉరవకొండలో వైసీపీ బ్రదర్స్ పోరు - అందుకే ఓడిపోతున్నాం : మంత్రి పెద్దిరెడ్డి సీరియస్..!!
అనంతపురం జిల్లా ఉరవకొండ వైసీపీ సమావేశంలో గందరగోళం ఏర్పడింది. వైసీపీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి పైన ఆయన సోదరుడు పార్టీ సమావేశంలో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. పార్టీ జిల్లా ఇంఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సమక్షంలో ఈ గలాటా చోటు చేసుకుంది. ఒంటెత్తు పోకడల కారణంగానే పార్టీ ఓడిపోతోందంటూ చేసిన వ్యాఖ్యలతో ఇద్దరు సోదరుల మద్దతు దారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో, మంత్రి పెద్దిరెడ్డి సీరియస్ అయ్యారు. ఇద్దిరనీ మందలించారు. మంత్రి అసంతృప్తితో వెళ్లిపోయారు.

ఉరవకొండ వైసీపీ సమావేశంలో గందరగోళం
వై నాట్ 175 అంటూ సీఎం జగన్ ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ..సీనియర్ నేతల మధ్య విభేదాలు బయటకొస్తున్నాయి. అనంతపురం జిల్లా ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డిపై ఆయన సోదరుడు మధుసూదన్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. ఆగ్రహానికి గురైన విశ్వ తన సోదరుడి ప్రసంగానికి అడ్డు తగిలారు.
మంత్రి పెద్దిరెడ్డి సమక్షంలోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. నియోజకవర్గంలో తానొక్కడే నాయకుడిగా ఉండాలని, తానే ఎమ్మెల్యే కావాలని ఓ నాయకుడి ఒంటెత్తు పోకడల కారణంగానే పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిందని ఆరోపించారు.
పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని విమర్శించారు. నియోజకవర్గంలో ఒక్క సారి మాత్రమే పార్టీ గెలిచిందని..175 స్థానాలు గెలవాలంటే ఉరవకొండలో సరైన అభ్యర్ధిని నిలబెట్టాలని సమావేశంలో తేల్చి చెప్పారు. పరోక్షంగా తన సోదరుడు విశ్వేశ్వర రెడ్డిపైన ఈ వ్యాఖ్యలు చేసారు.

విశ్వేశ్వర రెడ్డి మద్దతు దారుల అభ్యంతరం
ప్రత్యర్ధిని ఎదుర్కోవటానికి పోటీ చేసిన వారి వద్ద సరైన ప్రణాళికలు లేవంటూ వ్యాఖ్యానించారు. మధుసూధన్ రెడ్డి వ్యాఖ్యలను విశ్వేశ్వర రెడ్డి మద్దతు దారులు అడ్డుకున్నారు.దీంతో వేదిక పైన ఉన్న నేతలు వారించే ప్రయత్నం చేసినా మధుసూధన్ రెడ్డి పట్టించుకోలేదు. ఇద్దరి మద్దతు దారుల నినాదాలతో కాసేపు ప్రాంగణం దద్దరిల్లింది. విశ్వేశ్వర రెడ్డి ఆగ్రహంతో ఊగిపోయారు.
సోదరుడితో వాదనకు దిగారు. ఎవరూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు. రెండు వర్గాల హోరా హోరీ నినాదాలతో పోలీసులు రంగ ప్రవేశం చేసారు. మంత్రి పెద్దిరెడ్డి ఇద్దిరినీ కూర్చోబెట్టారు. నియోజకవర్గంలో మరో సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే శివరామిరెడ్డి స్పందించారు. నియోజకవర్గంలో వర్గాలు ఏమీ లేవని ఉన్నది ముఖ్యమంత్రి జగన్ వర్గమేనని చెప్పుకొచ్చారు.

నేతల పై మంత్రి పెద్దిరెడ్డి సీరియస్..
ఇద్దరి వాదనలు..కార్యకర్తల నినాదాలతో మంత్రి పెద్దిరెడ్డి సీరియస్ అయ్యారు. ఇద్దరినీ మందలించారు. మీ బలాబలాలు ప్రదర్శించడానికి పార్టీ మీటింగే దొరికిందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. కలసికట్టుగా పనిచేయాలని సూచించారు. తాను అందరికీ అందుబాటులో ఉంటానని, తన దగ్గరకు వచ్చి సమస్య గురించి మాట్లాడితే సామరస్యంగా పరిష్కరించేవాడినని చెప్పుకొచ్చారు.
ఈలలు వేయటం.. గట్టిగా అరవటం పైన ఆయన అసహనం వ్యక్తం చేసారు.నేతలు ఎవరైనా కలిసి కట్టుగా పని చేయాలని, సీఎం జగన్ డిసైడ్ చేసిన అభ్యర్ధిని గెలిపించాలని మంత్రి సూచించారు. ఎక్కువ సేపు మాట్లాడకుండానే తన ప్రసంగం ముగించి మంత్రి పెద్దిరెడ్డి వెళ్లిపోయారు. ఉరవకొండలో ప్రస్తుతం టీడీపీ నేత పయ్యావుల కేశవ్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక, ఉరవకొండలో పార్టీలో పరిస్థితుల పైన అధినాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.












Click it and Unblock the Notifications