పవన్ క్షమాపణ చెప్పాకే, ప్రమాణం చేయగలవా - పొన్నం సంచలనం..!!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ లక్ష్యంగా తెలంగాణ మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు చేసారు. పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన 'నవనిర్మాణ సభ'పై మంత్రి పొన్నం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా గతంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్.. ఇక్కడి ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పిన తర్వాతే హైదరాబాద్ లో సభలో పాల్గొనాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ పూర్తిగా బీజేపీ ఎజెండాను భుజాన వేసుకుని నడుస్తున్నారని ఆరోపించారు.
తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పైన తెలంగాణలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేసారు. గతంలో పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును, ఇక్కడి ప్రజలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను మంత్రి పొన్నం ఈ సందర్భంగా గుర్తు చేశారు. "తెలంగాణ ఏర్పడితే 11 రోజుల పాటు అన్నం తినడం మానేశానని బహిరంగంగా చెప్పుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్. 'తెలంగాణ ప్రజల చూపు పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండి పోతున్నాయి' అంటూ మనపై విషం కక్కిన చరిత్ర ఆయనది. అలాంటి వ్యక్తి తెలంగాణ సమాజా నికి క్షమాపణ చెప్పకుండా ఇక్కడ సభ ఎలా నిర్వహిస్తారు?" అని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. మీ నవనిర్మాణం ఏదో ఉంటే ఆంధ్రాలో చూపించుకోవాలి కానీ, తెలంగాణలో ఎందుకు?" అని నిలదీశారు.

పవన్ సమావేశం వేళ రాజకీయ ఉత్కంఠ
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పవన్ పాల్గొంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ ఇక్కడ రాజకీయ సభలు పెడితే తీవ్రంగా ఆక్షేపిస్తామని స్పష్టం చేశారు. బీజేపీకి తెలంగాణను తాకట్టు పెట్టడమే పవన్ స్థాపించే నవనిర్మాణమా అని దుయ్యబట్టారు. బీజేపీ కోసం తాను రావటం లేదని కొండగట్టు అంజన్న సాక్షిగా పవన్ ప్రమాణం చేసి చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. తెలంగాణ రక్తం ఉన్న, ఆత్మగౌరవం ఉన్న ఏ ఒక్క బిడ్డ కూడా పవన్ కళ్యాణ్ నిర్వహించే ఈ సభకు వెళ్లరని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ లో ఇతర రంగ ప్రముఖులు సైతం పవన్ తాజా వ్యాఖ్యలు.. సభ నిర్వహణ పైన స్పందిస్తున్నారు. పవన్ వ్యాఖ్యల పైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో.. పవన్ సభ నిర్వహణ పైన రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది.













Click it and Unblock the Notifications