మంత్రి రోజాకు మరో పదవి
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో మంత్రి ఆర్కే రోజాకు చోటు లభించింది
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో మంత్రి ఆర్కే రోజాకు చోటు లభించింది. ఏపీ క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజాకు స్థానం కల్పిస్తూ జనరల్ బాడీ ఆఫ్ ఇండియా సెక్రెటరీ జతిన్ నర్వాల్ మంత్రికి లేఖ రాశారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి కేంద్ర క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి అధ్యక్షుడిగా కొనసాగుతారు. కార్యవర్గంలో సభ్యులుగా ఏపీ, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిస్సా, త్రిపుర రాష్ట్రాలకు చెందిన క్రీడా శాఖల మంత్రులకు కూడా కేంద్రం చోటు కల్పించింది.
పర్యాటకశాఖతోపాటు క్రీడలశాఖను కూడా పర్యవేక్షిస్తున్న రోజా పాఠశాల స్థాయిలో విద్యార్థులను ఆటలాడించడాన్ని ప్రోత్సహిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొని తాను కూడా ఆ క్రీడలను ఆడటమే కాకుండా విద్యార్థినులను ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుంచి పోటీచేసిన రోజా రెండో విడత మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు.

మంత్రి రోజాకు తన సొంత నియోజకవర్గం నగరిలో అసమ్మతి పోరు ఎక్కువవుతోంది. నియోజకవర్గంలో మంత్రి ఉన్నప్పటికీ తనకు తెలియకుండానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటూ ముఖ్యమంత్రి జగన్ కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల సమయంలో రోజాను ప్రోత్సహించిన నాయకుల్లో కీలకమైనవారు మద్దతివ్వడం మానేశారు. శ్రీశైలం బోర్డు చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి, ఈడిగ కార్పొరేషన్ చైర్మన్ కేజే శాంతి నుంచి సహకారం కరవైంది.
ఇటీవలే నియోజకవర్గ పరిధిలోని కొప్పెడులో రైతు భరోసా కేంద్రానికి రోజా వ్యతిరేక వర్గం భూమి పూజ నిర్వహించింది. దీనిపై మంత్రి సీరియస్ అయ్యారు. ఒక మంత్రిగా తనను సంప్రదించకుండా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడంపై మండిపడ్డారు. నియోజకవర్గంలో తనను బలహీనురాలిని చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఓ ఆడియో సోషల్ మీడియాలో విడుదల చేశారు. వీరిని పార్టీ నాయకులని చెప్పి ప్రోత్సహించడం కూడా బాధకలిగిస్తోందన్నారు.












Click it and Unblock the Notifications