జగన్‌ను కాదని వెళ్లలేం- వెళ్లినా నష్టపోతాం
YS Jagan: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్తగా 11 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జీలను మార్చడం, కొత్తవారికి బాధ్యతలను అప్పగించడం.. రాష్ట్ర రాజకీయాలను హీటెక్కించింది. ఇంకో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్న ప్రస్తుత పరిస్థితుల్లో చోటు చేసుకున్న ఈ మార్పు మున్మందు మరిన్ని సంచలనాలను తెర తీయడం ఖాయంగా కనిపిస్తోంది.
నియోజకవర్గాల మార్పులపై రెండో విడత జాబితా వెలువడాల్సి ఉంది. దీనిపై పెద్ద ఎత్తున కసరత్తు సాగిస్తోంది వైఎస్ఆర్సీపీ అగ్రనాయకత్వం. ఈ సారి ఉమ్మడి తూర్పు గోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పులు- చేర్పులతో కూడిన రెండో జాబితా వెలువడుతుందని చెబుతున్నారు.

ఈ పరిణామాలపై మంత్రి రోజా స్పందించారు. ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. తన విషయంలో వైఎస్ జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది శిరోధార్యమేనని అన్నారు. పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పని చేస్తానని పేర్కొన్నారు.
మరోసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి, ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేయడానికి ఓ సామాన్య కార్యకర్తలా, సైనికుడిలా పని చేస్తానని రోజా చెప్పారు. నగరిలో తనకే అవకాశం లభిస్తుందని ఆశిస్తున్నానని, ఒకవేళ వేరే వారికి టికెట్ ఇచ్చినా గెలుపు కోసం కృషి చేస్తానని స్పష్టం చేశారు.
ఒక్కసారయినా ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవ చేయాలని ఆశించానని, అలాంటిది జగన్ తనకు రెండు సార్లు అవకాశం ఇచ్చారని రోజా గుర్తు చేశారు. మంత్రి పదవిని సైతం ఇచ్చి గౌరవించారని వ్యాఖ్యానించారు. తనను మారుస్తారని అనుకోవట్లేదని, ఒకవేళ మార్చిన జగన్ కోసం సీటును త్యాగం చేస్తానని అన్నారు.
జగన్‌ను ఎదిరించి, పార్టీలో నుంచి బయటికి వెళ్లినా.. తమకు మిగిలేదీ శూన్యమేనని రోజా తేల్చి చెప్పారు. ఇక్కడే ఉంటూ పార్టీ విజయానికి కృషి చేసిన వాళ్లని జగన్ ఎప్పుడూ మరిచిపోరని, ఎవరికి ఏం చేయాలో ఆయనకు బాగా తెలుసునని అన్నారు. 175కు 175 గెలవాలనే లక్ష్యంతో అభ్యర్థులను మార్చుతున్నందున అందరూ దానిని స్వాగతిస్తోన్నారని రోజా తెలిపారు.












Click it and Unblock the Notifications