2024లో జగనన్న వన్స్ మోర్; చంద్రబాబు, పవన్ లకు దమ్ముందా: మంత్రి రోజా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య నిత్యం మాటలు యుద్ధం కొనసాగుతోంది. వైసిపి చేసే కార్యక్రమాలపై టిడిపి, టిడిపి నేతల తీరుపై వైసీపీ విమర్శనాస్త్రాలు సంధించడం నిత్యకృత్యంగా మారింది. ఇక తాజాగా మాచర్లలో పర్యటించిన వైసిపి మంత్రి రోజా టిడిపి అధినేత చంద్రబాబును, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.
మాచర్ల నియోజకవర్గంలో శ్రీ లక్ష్మీచెన్నకేశవ స్వామి వారి తిరుణాల మహోత్సవం సందర్భంగా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు సంబరాలలో భాగంగా ఎడ్ల బండలాగుడు పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న రోజా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తనను చంద్రబాబు మహిళా పార్లమెంటుకు పిలిచి తనను అవమానించారని, మాచర్ల నుండి తనను పోలీసులతో అవమానించి తీసుకెళ్లి హైదరాబాద్లో వదిలేసారని మంత్రి రోజా గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు అదే టిడిపి కుళ్లుకునేలా, అదే పోలీసుల సెక్యూరిటీతో మాచర్లకు మంత్రిగా వచ్చానని, ఈ ఘనత జగనన్నకు దక్కుతుందని మంత్రి రోజా వ్యాఖ్యానించారు.

అంతేకాదు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట నడిచిన సైనికుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అని పేర్కొన్న రోజా, నాలుగు సార్లు ఆయనకు ప్రజలు పట్టం కట్టారని గుర్తు చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వంటి నాయకులు తనలాంటి వారికి ఇన్స్పిరేషన్ అన్నారు. ఇక ఇదే సమయంలో వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించటం ఎవరికి సాధ్యం కాదని పేర్కొన్న రోజా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి వచ్చినా వైఎస్ఆర్సిపి ని ఓడించలేరని ధీమా వ్యక్తం చేశారు.
2024 లో కూడా ప్రజలు జగనన్న వన్స్ మోర్ అంటున్నారని గతంలో పనిచేసిన ముఖ్యమంత్రి కంటే జగన్ ఎంతో గొప్పగా పాలన అందిస్తున్నారని రోజా పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజా సంక్షేమం కోసం ఏం చేసామో ఇంటింటికి వెళ్లి చెప్పే దమ్ము, ధైర్యం తమకే ఉందని పేర్కొన్న రోజా దమ్ముంటే టిడిపి మరియు జనసేన నాయకులు ఇంటింటికి వెళ్లి ఇంతకుముందు ప్రజలకు ఏం చేశారో చెప్పాలని అడిగారు. రాష్ట్రానికి లాభం చేయకపోగా ఓటుకు నోటు వంటి అప్రజాస్వామ్య పనులను చేసిన ఘనత చంద్రబాబుకి దక్కుతుందని రోజా మండిపడ్డారు.
ఇప్పుడు సీఎం జగన్ పై కుట్రలు, నీతిలేని రాజకీయాలు చేయాలని చూస్తే టిడిపి, జనసేన ను ప్రజలు తరిమి తరిమి కొడతారని రోజా వ్యాఖ్యలు చేశారు. వైసిపి నేతలతో మంచిగా ఉంటే మంచిగా ఉంటుందని, చెడుకు పోతే చెడుగానే ఉంటుందంటూ రోజా హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రానికి పట్టిన దరిద్రం, సైతాన్ చంద్రబాబు అంటూ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. కుప్పంలో కూడా చంద్రబాబుకు ఓటమి తప్పదని రోజా పేర్కొన్నారు. ఇంకో పది నెలల కాలంలో వచ్చే ఎన్నికల్లో వైసిపి భారీ మెజారిటీతో గెలిచి మళ్లీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని రోజా పేర్కొన్నారు. జగనన్నే మా భవిష్యత్తు అని ప్రజలు బలంగా నమ్ముతున్నారని, మళ్లీ అధికారం తమదేనని రోజా వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications