పవన్ కళ్యాణ్, బండ్ల గణేష్ లపై.. రుషికొండలో మంత్రి రోజా షాకింగ్ కామెంట్స్!!
ఏపీ మంత్రి, నిత్యం చంద్రబాబును, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసే రోజా తాజాగా బండ్ల గణేష్ పైన, పవన్ కళ్యాణ్ పైన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నేడు విశాఖలోని రుషికొండ పై నూతనంగా నిర్మించిన పర్యాటకశాఖ భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రోజా అనేక సంచలన వ్యాఖ్యలను చేశారు.
విశాఖలోని రుషికొండపై నూతనంగా నిర్మించిన భవనాలు పర్యాటకరంగానికే తలమానికమని రాష్ట్ర పర్యాటక శాఖమంత్రి ఆర్కే రోజా అన్నారు.గతంలో వున్న హరిత రిసార్ట్ ల స్థానంలో అంతర్జాతీయ ప్రమాణాలతో పర్యాటకశాఖ నిర్మించిన భవనాలను విశాఖ శ్రీశారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి నేడు ప్రారంభించారు...ఈకార్యక్రమానికి రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి అమర్నాథ్, రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి, భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పర్యాటక శాఖ మంత్రి రోజా మాట్లాడుతూ సకల హంగులతో , అన్ని అనుమతులతో నిర్మించిన ఏడు భవనాలను ఏ విధంగా వినియోగించాలన్న అంశంపై త్వరలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకుంటారన్నారు. ఇప్పటికే దీనిపై ఏర్పాటైన త్రిసభ్య కమిటీ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంగా ఈ భవనాలను ఉపయోగించుకోవచ్చని నివేదిక లో తెలిపిన విషయాన్ని మంత్రి రోజా వెల్లడించారు. దీనిపై త్వరలోనే స్పష్టత వస్తుందని మంత్రి తెలిపారు.
ఇదే సమయంలో బండ్ల గణేష్ మంత్రి రోజాపై చేసిన వ్యాఖ్యలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆమె బండ్ల గణేష్ అంటే ఎవరు అంటూ ప్రశ్నించారు. 7 'o' క్లాక్ బ్లేడుతో గొంతు కోసుకుని చస్తానన్న వాడు కదా అంటూ పేర్కొన్న రోజా ఆయన తనపై మాట్లాడడమా అంటూ మండిపడ్డారు. స్వశక్తితో ఎదుగుతున్న మహిళలను నీచంగా మాట్లాడడం ఆయన నైజం అంటూ అసహనం వ్యక్తం చేశారు.
అంతేకాదు తాడేపల్లిగూడెం సభలో జగన్ ను అదః పాతాళానికి తొక్కుతా మంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు దగ్గర ఊడిగం చేస్తున్న పవన్ కళ్యాణ్ తానే పాతాళానికి వెళ్ళాడు అంటూ కౌంటర్ ఇచ్చారు. పార్టీ పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన ఎన్నికల్లో ఒకచోట అయినా గెలిచాడా అంటూ ఎద్దేవా చేశారు. పార్టీని గాలికి వదిలేసి చంద్రబాబు చుట్టూ తిరుగుతున్నాడని మండిపడ్డారు. రెండు చోట్ల ఓడిపోవడం సిగ్గుచేటని పవన్ కళ్యాణ్ ను మంత్రి రోజా ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications