మేనిఫెస్టో అంటే చంద్రబాబుకు చిత్తు కాగితంతో సమానం: మంత్రి రోజా ఘాటువ్యాఖ్యలు!!
ఏపీ మంత్రి రోజా టిడిపి మేనిఫెస్టో పై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ, వైయస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనకు కితాబిచ్చారు. టిడిపి మేనిఫెస్టోను జనాలు నమ్మే పరిస్థితుల్లో లేరని రోజా పేర్కొన్నారు. మహానాడు సందర్భంగా టీడీపీ విడుదల చేసిన మేనిఫెస్టో పై స్పందించిన రోజా మూడుసార్లు సీఎంగా ఉండి కూడా యువతకి, మహిళలకు చంద్రబాబు ఏం చేయలేదని మండిపడ్డారు.
చంద్రబాబు రైతులను ఎలా మోసం చేశారో అందరికీ తెలుసని రోజా మండిపడ్డారు. యువతను చంద్రబాబు ఆదుకుంటానని చెప్పడం పెద్ద జోక్ అని, గతంలో చంద్రబాబు చేసిన మోసాన్ని యువత మర్చిపోలేదని మంత్రి రోజా గుర్తు చేశారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో తాను ఇచ్చిన హామీలన్నీ నెరవేరిస్తే చంద్రబాబు తాను సీఎంగా ఉన్నప్పుడు ఏం చేశారో చెప్పాలని రోజా ప్రశ్నించారు.

వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన అమ్మఒడిపై ఇష్టానుసారంగా మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు అమ్మకు వందనం అంటూ కొత్త పథకాన్ని ఇస్తామని చెబుతున్నారని రోజా విమర్శించారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఎందుకు ఈ పథకాలు అమలు చేయలేదో చెప్పాలని ప్రశ్నించారు. మేనిఫెస్టో అంటే చంద్రబాబుకు చిత్తు కాగితంతో సమానమని, ప్రజలను మళ్లీ మోసం చేయడానికి చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని రోజా విమర్శించారు.
3300 చికిత్సలకు ఆరోగ్యశ్రీ అందిస్తున్నది ఏపీ సీఎం జగన్ మాత్రమేనని మంత్రి రోజా స్పష్టం చేశారు. సీఎం జగన్ చేయగలిగినవి చెప్పి చేసి చూపించారని, చంద్రబాబు మాత్రం అబద్ధపు హామీలతో మోసం చేస్తున్నారని రోజా మండిపడ్డారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనకు కితాబిచ్చిన రోజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారన్నారు.
జగన్మోహన్ రెడ్డి దాదాపుగా 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసినప్పుడు ప్రజల కష్టాలు నేరుగా చూసి నేను ఉన్నాను, నేను విన్నాను అని భరోసా ఇచ్చారని, ఈ నాలుగు సంవత్సరాలలో తన పరిపాలన ద్వారా ప్రజలకు నమ్మకాన్ని కలిగించారని పేర్కొన్నారు.సచివాలయ వ్యవస్థతో జగన్ ప్రభుత్వం యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించింది అని మంత్రి రోజా తెలిపారు.
ఎంపీ అవినాష్ రెడ్డిని సిబిఐ విచారణ పేరుతో ఇబ్బంది పెట్టారని, వివేకా కేసులో సీబీఐ చేసిన ఆరోపణలకు సాక్ష్యాలు లేవని జడ్జి చెప్పారన్నది అందరూ గమనించాలన్నారు. ఎల్లో మీడియాలో ఇష్టానుసారం చర్చలు పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. వైఎస్ అవినాష్ రెడ్డి పై తప్పుడు ప్రచారం చేస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి రోజా డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications