మంత్రి రోజా కు "మెగా" సెగ : చిరంజీవిపై కామెంట్స్ - సొంత పార్టీలోనే..!?
వైసీపీ ఫైర్ బ్రాండ్ మంత్రి రోజా మెగా బ్రదర్స్ పై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ప్రధానంగా మంత్రి రోజా పవన్ ..నాగబాబుతో పాటుగా చిరంజీవిని కలిపి విమర్శలు చేయటం పైన సొంత పార్టీలోనే భిన్నాబిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. సీఎం జగన్ - చిరంజీవి మధ్య రాజకీయాలకు అతీతంగా సత్సంబంధాలు ఉన్నాయి. పవన్ కల్యాణ్ పైన రాజకీయంగా ఎలా ఉన్నా..చిరంజీవి పైన వైసీపీ నేతలు ఇప్పటి వరకు విమర్శలు చేయలేదు. వ్యూహాత్మకంగానే చిరంజీవి తో వైసీపీ వ్యవహరిస్తోంది. ఇప్పుడు రోజా చిరంజీవి ప్రజారాజ్యంలో ఓటమి.. ప్రజల ఆదరణ సంగతి గురించి విమర్శలు చేయటం మెగా ఫ్యాన్స్ కే కాదు.. వైసీపీ నేతలకు నచ్చటం లేదు.

సీఎం జగన్ తో "మెగా" రిలేషన్..
2019 ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన తరువాత మెగా బంధం కొనసాగిస్తున్నారు. సినీ పరిశ్రమ వ్యవహారాల్లో చిరంజీవితోనే చర్చలకు సీఎం జగన్ ప్రాధాన్యత ఇచ్చారు. ఏ సమస్య ఉన్నా తనతో నేరుగా చర్చించాలని సూచించారు. చిరంజీవి అదే విధంగా పలు మార్లు సీఎంతో భేటీ అయి టికెట్ల సమస్య పరిష్కారంపైన చర్చించారు. అటు పవన్ తో వైసీపీ పొలిటికల్ వార్ కొనసాగుతూనే ఉంది. సీఎం తో చిరంజీవి భేటీ సమయంలో చేతులు జోడించి వేడుకున్న వీడియో బయటకు వచ్చింది. దీని పైన పరోక్షంగా పవన్ వ్యాఖ్యలు చేసారు. సీఎం వద్దకు వెళ్ల ఏ స్థాయి వ్యక్తులు అయినా చేతులు జోడించి వేడుకోవాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఒక దశలో చిరంజీవికి వైసీపీ నుంచి రాజ్యసభ ఇస్తారనే ప్రచారమూ సాగింది. చిరంజీవి ని చూసైనా ఎలా ఉండాలో నేర్చుకోవాలంటూ అంబటి రాంబాబు లాంటి నేతలు జనసేనాని లక్ష్యంగా చేసుకొని ఆరోపణలు చేసారు. ఒక విధంగా చిరంజీవితో సఖ్యత గా ఉంటూ..పవన్ ను రాజకీయంగా ఆత్మరక్షణలోకి నెట్టే వ్యూహం అమలు చేస్తున్నారు.

గతంలో ప్రశంసలు..ఇప్పుడు విమర్శలు
ఇక, ఇప్పుడు మంత్రి రోజా మెగా బ్రదర్స్ ను రాజకీయంగా టార్గెట్ చేసారు. అందులో అన్న దమ్ముల గురించి ప్రస్తావిస్తూ గతంలో చిరంజీవి పొలకొల్లు ఓటమి గురించి ప్రస్తావించారు. ఇదే ఇప్పుడు చర్చకు కారణమైంది. వైసీపీ గురించి చిరంజీవి ఎటువంటి విమర్శలు చేయలేదు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటుగా చిరంజీవి ఇంటికి వెళ్లారు. చిరంజీవి ని ప్రశంసిస్తూ సందర్భాల్లో పవన్ ను ఇరుకున పెట్టేలా వ్యాఖ్యలు చేసారు. ఇప్పుడు నాగబాబు, పవన్ ను లక్ష్యం చేసుకున్న క్రమంలో చిరంజీవి పేరు ప్రస్తావన ఎందుకుని వైసీపీ నేతలే ప్రశ్నిస్తున్నారు. పవన్ కల్యాణ్ వైసీపీని.. సీఎం జగన్ ను కార్నర్ చేస్తున్న సమయంలో పవన్ పైన మాట్లాడచ్చు కానీ, చిరంజీవి గురించి మాట్లాడటం పైనే చర్చ సాగుతోంది. పాలకొల్లులో చిరంజీవి, 2019 ఎన్నికల్లో భీమవరంలో పవన్ ఓడిపోవటం గురించి ప్రస్తావించిన రోజా కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసారు.

కేసీఆర్ పైనా అదే రేంజ్ లో ఫైర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన రోజా ఫైర్ అయ్యారు. ఏపీలో బీఆర్ఎస్ ఏ విధంగా అడుగు పెడుతుందని నిలదీసారు. గతంలో హైదరాబాద్ లో పలుమార్లు రోజా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసారు. కేసీఆర్ తన తండ్రి సమానులని గౌరవించారు. కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో తమిళనాడుకు వెళ్తున్న సమయంలో నగరిలో తన నివాసంలో విందు ఇచ్చి..సత్కరించారు. మంత్రిగా అయిన తరువాత ప్రత్యేకంగా కేసీఆర్ వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. అయితే, ఇప్పుడు అదే కేసీఆర్ పైన చేసిన వ్యాఖ్యల గురించి సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. రాజకీయంగా చేసిన విమర్శలుగా విశ్లేషణలు మొదలయ్యాయి. ఇక.. ఏనాడు వైసీపీ గురించి మాట్లాడని చిరంజీవి ప్రస్తావన ఎందుకు అంటూ రోజా పైన ప్రశ్నలు మొదలయ్యాయి.












Click it and Unblock the Notifications