మంత్రుల ప్రమాణ స్వీకారం - జగన్ కు పాదాభివందనాలు : రోజా ఎమోషనల్ -సీఎం చేతికి ముద్దు...!!
ఆంధ్రప్రదేశ్ కొత్త కేబినెట్ కొలువు తీరింది. ఏపీ నూతన మంత్రులుగా 25 మంది ప్రమాణ స్వీకారం చేసారు. గవర్నర్ బిశ్వభూషణ్ వారితో ప్రమాణం చేయించారు. జగన్ తన కేబినెట్ కూర్పులో అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని..2024 ఎన్నికల కేబినెట్ ను ఏర్పాటు చేసుకున్నారు. ముందుగా నిర్ణయించిన ముహర్తం మేరకే సరిగ్గా 11.31 గంటలకు మంత్రుల ప్రమాణ స్వీకారం ప్రారంభించారు. అక్షర క్రమంలో మంత్రుల ప్రమాణ స్వీకారం కొనసాగింది. తొలుత అంబటి రాంబాబు మంత్రిగా ప్రమాణం చేసారు.

కొత్త మంత్రుల్లో సంతోషం - ఉద్వేగం
మంత్రులంతా తెలుగులో ప్రమాణ స్వీకారం చేయగా..ప్రకాశం జిల్లాకు చెందిన ఆదిమూలపు సురేష్.. అనంతపురం జిల్లాకు చెందిన ఉష శ్రీచరణ్..సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంగ్లీషులో ప్రమాణం చేసారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన అమర్నాద్..ముత్యాలనాయుడు..జోగి రమేష్..ఉషశ్రీ చరణ్..మేరుగ నాగార్జున..రాజన్న దొర..విడదల రజని ప్రమాణం చేయగానే సీఎం జగన్ కు పాదాభివందనం చేసారు. సీఎం వారిని వారిస్తున్నా..తమకు మంత్రులుగా అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పారు. అయితే, మాజీ మంత్రులు అందరూ హాజరు కావాలని సీఎం చివరి కేబినెట్ సమావేశంలో సూచించినా..మంత్రి పదవులు తిరిగి పొందని వారు అనేక మంది ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.
రోజా ఎమోషనల్ - ఆనంద భాష్పాలతో
పాత వారిలొ 11 మంది తిరిగి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసారు. మిగిలిన వారిలో కొడాలి నాని..పేర్ని నాని.. పుష్ఫశ్రీ వాణీ..శంకర నారాయణ..అవంతి హాజరయ్యారు. డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి సైతం హాజరయ్యారు. అయితే, స్పీకర్ తమ్మినేని సైతం దూరంగా ఉన్నారు. మంత్రి పదవులు రాలేదని ఆగ్రహంతో ఉన్న సుచరిత..బాలినేని గైర్హాజరయ్యారు. రోజా తన ప్రమాణ స్వీకార సమయంలో ఉద్వేగానికి లోనయ్యారు. రోజా అనే నేను.. అంటూ ఉబికి వస్తున్న కన్నీటిని అదుపు చేసుకుంటూ ప్రమాణ పాఠం పూర్తి చేసారు. తన ప్రమాణం పూర్తి కాగానే జగన్ కు పాదాభివందనం చేసారు. ఆ వెంటనే జగన్ చేయి తీసుకొని ఆప్యాయంగా ముద్దు పెడుతూ తనకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పారు.

ఇక, శాఖల కేటాయింపుపై కసరత్తు
కొత్తగా ప్రమాణం చేసిన మంత్రులతో సీఎం -గవర్నర్ గ్రూపు ఫొటో దిగారు. గవర్నర్ తో పాటుగా మంత్రులకు సీఎం జగన్ తేనేటి విందు ఏర్పాటు చేసారు. ఇక, కొత్తగా మంత్రులుగా ప్రమాణం చేసిన వారికి పెద్ద ఎత్తున అభినందనలు వెల్లువెత్తాయి. ఈ సాయంత్రానికి కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు పూర్తి కానుంది. గతంలో వలే అయిదు వర్గాలకు..అయిదు డిప్యూటీ సీఎం పదవులు ఖరారు చేయనున్నారు. ఇక, పదవులు దక్కని మంత్రులకు పార్టీ పదవులు..కేబినెట్ హోదాతో కూడిన పదవులు ఇవ్వటం పైన సీఎం కసరత్తు ప్రారంభించనున్నారు.












Click it and Unblock the Notifications