రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నేను.. రెండుచోట్లా ఓడిపోయిన నీతో: రోజా ఫైర్
అమరావతి: శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన పార్టీ నిర్వహించిన యువ శక్తి సభలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కౌంటర్ అటాక్స్ మొదలయ్యాయి. ఆ పార్టీ మంత్రులు, మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు తమ విమర్శలకు పదును పెట్టారు. మాటల తూటాలను పేల్చుతున్నారు. పవన్ కల్యాణ్ చేసిన విమర్శలు, ఆరోపణలకు ధీటుగా స్పందిస్తోన్నారు.

పవన్ విమర్శలపై మాజీ మంత్రి పేర్ని నాని ఘాటుగా స్పందించారు. ఆయనపై నిప్పులు చెరిగారు. 2009లో వైఎస్సార్ పంచెకు ఉన్న దారంపోగును కూడా పవన్ కల్యాణ్ ముట్టుకోలేకపోయాడని అన్నారు. 2009 నుంచి 2014 వరకు పవన్ కల్యాణ్ అడ్రస్ లేకుండా పోయాడని ధ్వజమెత్తారు. సినిమా మత్తులో సొల్లు కబుర్లు చెప్పడం తప్ప ఇంకేమీ చేయలేకపోయాడని ఎద్దేవా చేశారు. ఇలాంటి డబ్బా మాటలతో జన సైనికులను మభ్య పెట్టొచ్చేమో కానీ జనాలను కాదని తేల్చిచెప్పారు.

తనను డైమండ్ రాణి అంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను పర్యాటక శాఖ మంత్రి రోజా తిప్పికొట్టారు. తాను రెండుసార్లు శాసనసభ్యురాలిగా గెలిచానని, ఇప్పుడు మంత్రిగా పని చేస్తోన్నానని గుర్తు చేశారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో పవన్ కల్యాణ్ ఓడిపోయిన విషయాన్ని ప్రస్తావించారు. ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచిన తాను.. రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కల్యాణ్ తో తిట్టించుకోవాలా?.. ప్రజల కోసం తప్పట్లేదని అన్నారు.

పవిత్రమైన స్వామి వివేకానందుడి జయంతి నాడు పవన్ కల్యాణ్ యువతను రెచ్చగొట్టేలా వ్యాఖ్యానాలు చేయడం దురదృష్టకరమని హోం శాఖ మాజీ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. నోటికొచ్చినట్టు తిట్టండి, కొట్టండి- అంటూ వివేకాందుడి జయంతి నాడు యువతకు పవన్ కల్యాణ్ ఇచ్చే సందేశం ఇదేనా? అని నిలదీశారు. థియేటర్లలో, మాల్స్ లో పవన్ సైకో అభిమానుల అరాచకాలకు అంతు ఉండట్లేదని, యువతను ఇలా రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడం సిగ్గుచేటు అని ధ్వజమెత్తారు.

తన సహచర మంత్రి రోజాను పవన్ కల్యాణ్ డైమండ్ రాణి అని సంబోదించడాన్ని జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తప్పు పట్టారు. ఆమె డైమండ్ రాణి అయితే .. నువ్వు చంద్రబాబు జోకర్ వి అంటూ ధ్వజమెత్తారు. తాను సంబరాల రాంబాబునైతే నువ్వు కల్యాణాల పవన్ వి అంటూ సెటైర్లు సంధించారాయన. పీకే అంటు పిచ్చికుక్క అని అభివర్ణించారు అంబటి రాంబాబు.












Click it and Unblock the Notifications