విశాఖ ఫార్మాసిటీలో భారీ పేలుడు, ఇద్దరు మృతి: చంద్రబాబు ఆరా
విశాఖ: విశాఖపట్నం జిల్లాలోని పరవాడ ఫార్మా సిటీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సాయినాథ్ లైఫ్స్ సెన్సెస్ కంపెనీలో రియాక్టర్ పేలింది. ఈ భారీ పేలుడు చోటుచేసుకోవడంతో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు.
మరో ఇద్దరు కార్మికులు మంటల్లో గల్లంతయ్యారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నాలు చేస్తోంది.
గల్లంతైన ఇద్దరు కార్మికుల మృతి
విశాఖ ఫార్మాసిటీలో గల్లంతైన ఇద్దరు కార్మికులు ప్రమాదంలో మృతి చెందినట్లు గుర్తించారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. భద్రతా సరిగా లేకపోవడం వల్లనే ప్రమాదం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రమాదంపై చంద్రబాబు ఆరా
విశాఖ ఫార్మాసిటీలో జరిగిన అగ్ని ప్రమాదం పైన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.
కపిలతీర్థం మృతుల కుటుంబాలకు రూ.2లక్షల పరిహారం: బొజ్జల
చిత్తూరు జిల్లా కపిలతీర్థం ఘటనలో మృతుల కుటుంబాలను ఏపీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి పరామర్శించారు. తిరుపతిలోని చంద్రశేఖర్ రెడ్డి కాలనీలోని సోమవారం బాధిత కుటుంబాలను పరార్శించిన ఆయన రూ.2లక్షల పరిహారం ప్రకటించారు. ఈ సందర్భంగా కపిలతీర్థం వద్ద జలపాతం పరిసర ప్రాంతాన్ని నిషేధిత స్థలంగా ప్రకటిస్తామన్నారు.
ఎస్సీ హాస్టల్ విద్యార్థినీల సామూహిక నిరాహార దీక్ష
విజయనగరం జిల్లాలోని శృంగవరపుకోట ఎస్టీ హాస్టల్ విద్యార్థినీలు సామూహిక నిరాహార దీక్షకు దిగారు. తమకు పక్కా వసతి గృహం కావాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఆదివారం రాత్రి నుంచి వారు నిరాహార దీక్షకు దిగారు. దీంతో, సోమవారం నాడు ఉదయం కొందరు విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. దాదాపు, ఎనిమిది మంది విద్యార్థులు సొమ్మసిల్లారని తెలుస్తోంది. వారిని ఆసుపత్రికి తరలించారు.
పక్కా వసతి గృహం కోసం విజయనగరం జిల్లా ఎస్ కోట మండలంలోని ఎస్సీ కాలేజీ విద్యార్థినిలు ధర్నా చేశారు. తమకు సరైన వసతులు లేవని, భోజనం చక్కగా పెట్టడం లేదని వారు ఆరోపిస్తున్నారు. కాగా, సోమవారం సాయంత్రం అధికారుల హామీతో విద్యార్థినిలు దీక్షను విరమించారు.












Click it and Unblock the Notifications