నవ్వినందుకు చంపేస్తారా.. మరి నిన్నేం చేయాలి ??
క్షణికావేశంలో మనుషులు మృగాళ్ల లాగా మారుతున్నారని చెప్పడానికి ఈ ఘటన కూడా ఒక ఉదాహరణ. భార్యాభర్తలు వైవాహిక జీవితంలో గొడవలు పడడం, కలిసి పోవడం సర్వసాధారణం. గొడవలు లేకుండా కాపురాన్ని చక్కబెట్టుకోవాల్సిన బాధ్యత ఆ జంటదే. కానీ ఆ గొడవ కారణంగా భార్య తనని వదిలేసి వెళ్లిపోతున్న తరుణంలో.. ఆ ఘటనను చూసి స్థానికులు నవ్వడాన్ని సహించలేక ఓ వ్యక్తి జంతువు లాగా ప్రవర్తించాడు. ఆ నవ్విన జనంలో 17 ఏళ్ల బాలుడిని హత్య చేశాడు. ఈ అత్యంత దారుణమైన విషయం ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలో చోటుచేసుకోగా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక గువ్వల కాలనీలో పూసలు అమ్ముకుంటూ జీవనం సాగించే ఒక వ్యక్తిని ఇటీవల అతని భార్య వదిలేసి వెళ్లిపోయింది. భార్య వెళ్లిపోతున్న సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు, చుట్టుపక్కల వారు ఈ ఘటనను చూసి నవ్వారు. అందరి ముందు జరిగిన ఈ సంఘటనతో ఆ పూసలు అమ్ముకునే వ్యక్తి తీవ్రంగా అవమానానికి, ఆగ్రహానికి గురయ్యాడు. అయితే
ఆ నవ్వినవారిలో శ్రీహరి (17) అనే బాలుడు కూడా ఉన్నాడు.

తనను చూసి నవ్వినందుకు మొదట ఆ వ్యక్తి.. శ్రీహరిపై దాడి చేసి గాయపరిచాడు. విషయం తెలుసుకున్న బాలుడి తండ్రి.. తన కొడుకును ఎందుకు కొట్టావంటూ నిందితుడి వద్దకు వచ్చి గొడవకు దిగాడు. తండ్రి అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత.. బాలుడుతో నిందితుడు మళ్లీ గొడవపడ్డారు. ఈ క్రమంలో నిందితుడు తాను పూసల దారాలు కోసేందుకు ఉపయోగించే పదునైన కత్తితో బాలుడి మెడపై దాడి చేశాడు. ఈ దారుణ ఘటనతో గువ్వల కాలనీలో భయాందోళన వాతావరణం నెలకొంది.
కాగా నిందితుడి దాడిలో తీవ్ర గాయాలపాలైన శ్రీహరిని స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ శ్రీహరి మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు బాలుడి మృతిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. కేవలం నవ్వినందుకు ఆవేశంలో ఇంతటి ఘాతుకానికి పాల్పడిన నిందితుడిని ఏం చేయాలంటూ స్థానికులు మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications