అరసవల్లిలో అద్భుతం; రథసప్తమినాడు సూర్య భగవానుడి నిజరూప దర్శనం!!
కలియుగ ప్రత్యక్ష దైవం.. దేశం లోనే పూజలు జరిగే ఏకైక సూర్య దేవాలయం శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్య దేవాలయంలో రధసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదిత్యుడి సూర్యజయంతి సందర్భంగా అరసవల్లి పుణ్య క్షేత్ర సూర్య భగవానుడి దర్శనానికి భక్తులు పోటెత్తారు.సూర్యుని పుట్టిన రోజైన ఈ రధసప్తమి నాడు అరసవల్లి సూర్య దేవాలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.
ఆరోగ్య ప్రదాత ఆ సూర్య భగవానుడి నిజ రూప దర్శనంతో రోగ పీడలు నివారణ జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ రోజు రథ సప్తమి సందర్భంగా సూర్యదేవునికి విశేష పూజలు జరిగాయి. ముందుగా విశాఖ శ్రీ శారదా పీఠాదిపతి శ్రీ స్వరూపానంద సరస్వతి శిష్య పరంపర అయిన స్వాత్మనందేంద్ర సరస్వతి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ఉత్సవానికి అంకురార్పణ చేశారు. దీంతో స్వామివారి సూర్యజయంతి ఉత్సవాలు ఘనంగా మొదలయ్యాయి.

ఆపై సూర్య భగవానుడికి క్షీరాభిషేకం నిర్వహించారు. పాలు, పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలుతో స్వామివారికి విశేష అభిషేకాలు జరిగాయి. ఈ రోజు ఉదయం అయిదు గంటల నుండి భక్తులకు స్వామి వారి నిజరూప దర్శనం ప్రారంభం అయింది. రధసప్తమి సందర్భంగా స్వామి వారికి విశేష పుష్పమాల అలంకరణ సేవ, విశేష అర్చన, నీరాజనం వంటి పూజాధికాలను నిర్వహించారు. దేశం నలుమూలల నుండి తరలి వచ్చిన భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.
ఈ నిజరూప దర్శనం సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగనుంది. స్వామి వారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు లక్షల సంఖ్యలో భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారితో అరసవల్లి క్రిక్కిరిసిపోయింది. అరసవల్లి సూర్య భగవానుడి నిజరూప దర్శనం ఏడాదికి ఒక్కసారి మాత్రమే దొరకనున్న నేపధ్యంలో భక్తజనం పోటెత్తారు. ఆలయ అధికారులు భక్తుల రద్దీకి తగినట్టు మౌలిక వసతులను కల్పించారు.
రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు , శ్రీకాకుళం ఎంపీ కె.రామ్మోహన్ నాయుడు పలువురు శాసన సభ్యులు ,శాసన మండలి సభ్యులు ,అధికారులు వేకువ జామున స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఒక్క అరసవల్లిలో మాత్రమే కాకుండా అన్ని వైష్ణవాలయాలలో ఈరోజు రథ సప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications