AP Weather: ఏపీలో వచ్చే రెండ్రోజులు అటు ఎండలు- ఇటు వర్షాలు..!
వేసవితాపంతో అల్లాడుతున్న ఏపీ ప్రజలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ విభాగం ఓ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో రేపటి నుంచి రెండు రోజుల పాటు మిశ్రమ వాతావరణం (weather) ఉండబోతోందని వెల్లడించింది. ఇందులో భాగంగా పలు చోట్ల వర్షాలు కురుస్తాయని, అలాగే ఇంకొన్ని చోట్ల వడగాల్పులు కూడా ఉంటాయని తెలిపింది. అయితే ఇవి ఎక్కడెక్కడ ఉంటాయన్న వివరాలను కూడా వెల్లడించింది.
రానున్న రెండు రోజులు రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు ఉంటాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. రేపు,ఎల్లుండి మేఘావృతమైన వాతావరణంతో పాటు పిడుగులతో కూడిన వర్షాలు, మరోవైపు కొన్ని జిల్లాల్లో ఎండలు ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. దక్షిణ కోస్తాంధ్ర -పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని ఏపీఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. రాయలసీమ మరియు పరిసర ప్రాంతాలపై మరోక ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని పేర్కొన్నారు.

వీటి ప్రభావంతో రేపు, ఎల్లుండి మేఘావృతమైన వాతావరణంతో పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పని చేసే రైతులు, పశు కాపరులు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
అయితే రేపు పోలవరం జిల్లా చింతూరు, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో వడగాలులు ప్రభావం చూపనున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications