కూటమికి సవాల్ గా మారుతున్న ఎమ్మెల్యే ఆది..!!
బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి జిల్లాలో సిమెంట్ కంపెనీలతో వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారింది. గతంలో ఫ్లైయష్ కోసం జేసీ ప్రభాకర్ రెడ్డి - ఆది మధ్య పెద్ద వివాదామే సాగింది. ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు తిరిగి ఆదినారాయణ రెడ్డి సిమెంట్ కంపెనీల పైన జులుం ప్రదర్శించటం సంచలనంగా మారింది. ఈ వరుస వ్యవహారాలు కూటమి ప్రభుత్వానికి సమస్యగా మారుతున్నాయి.
ఎమ్మెల్యే జులుం
జమ్మలమడుగు ఎమ్మెల్యే అదినారాయణ రెడ్డి వ్యవహార శైలి పైన పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తు న్నాయి. తాజాగా సిమెంట్ కంపెనీల పైన జులుం ప్రదర్శించటం సంచలనంగా మారింది. వాటికి అవసరమైన ముడి సరుకు సరఫరా రవాణాతో పాటు, అక్కడ ఉత్పత్తి అయిన సిమెంట్ కు సంబంధించిన రవాణా కాంట్రాక్టులు అన్నీ తనకే ఇవ్వాలని ఆది డిమాండ్ చేసారు. కాగా, ఇప్పటి కే సిమెంట్ యాజమాన్యం కొన్ని కాంట్రాక్టులను ఆయన అనుచరులకే ఇచ్చినా, అవి సరిపోవని మొత్తం తమకే కావాలంటూ తీవ్రస్థాయిలో ఒత్తిడి చేస్తున్నారు. అది కుదరదన్నందుకు ఆ పరిశ్రమలకు ముడిసరకు రవాణా జరగకుండా ఆపేశారు. దీంతో ఇప్పటికే ఓ ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిచిపోగా, నేడు నుంచి మరో ప్లాంట్‌లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.

కాంట్రాక్టుల కోసం
జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని చిలమకూరు, ఎర్రగుంట్లల్లో అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమ యూనిట్లు ఉన్నాయి. ఈ యూనిట్లకు అవసరమైన ముడి సరకు సరఫరా జరగకుండా ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. రాయలసీమ థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి ఫ్లైయాష్ రవాణా చేసే లారీలను ఆపేశారు. ఫ్లైయాష్ రవాణా చేయొద్దంటూ అక్కడి సీఐ లారీల యజమానులకు హుకుం జారీ చేయడంతో సరఫరా నిలిచిపోయింది. సిమెంట్ పరిశ్రమకు సున్నపురాయిని రవాణా చేస్తుంటారు. ఈ లారీలను కూడా ఆపేశారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తన అనుచరులను రంగంలోకి దింపడంతో పరిశ్రమలోకి సున్నపురాయి తీసుకెళ్లే మార్గంలో ఓ మినీ బస్సును అడ్డంగా పెట్టి లారీలను ఆపేశారు. వారంతా అక్కడే చెట్లకింద ఉండి లారీలు వెళ్లకుండా పహారా కాస్తున్నారు.
కూటమికి సమస్యగా
ఇదే పరిస్థితి గత అయిదు రోజులుగా కొనసాగుతోంది. ఫ్లైయాష్, సున్నపురాయి సరఫరా ఆగిపోవ డంతో, చిలమకూరు ప్లాంట్‌లో సిమెంట్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఎర్రగుంట్ల ప్లాంట్‌లో ప్రస్తుతానికి ఉన్న ముడిసరకుతో సిమెంట్ ఉత్పత్తి జరిగింది. ఫ్లైయాష్ రవాణా, జిప్సం తీసుకురావడం తదితర కాంట్రాక్టులన్నీ తమవారికే కట్టబెట్టాలని ఎమ్మెల్యే ఒత్తిడి చేస్తున్నారు. గతంలోనూ ఇలాంటి వివాదాల సమయంలో సీఎం చంద్రబాబు మందలించారు. వివాదాలకు దూరంగా ఉండాలని సూచించారు. అయినా, ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి జులుం పైన జరుగుతున్న ప్రచారం కూటమికి సమస్యగా మారుతోంది.












Click it and Unblock the Notifications