జగన్ ఫోన్ చేసి అడిగారు - క్రాస్ ఓటింగ్ పై ఆనం క్లారిటీ..!!
వైసీపీ తనను సస్పెండ్ చేయటం పైన సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. తాను క్రాస్ ఓటింగ్ చేసినట్లు ఆధారాలు ఉంటే చూపించాలని సవాల్ చేసారు. తాను టీడీపీ నుంచి డబ్బులు తీసుకొని క్రాస్ ఓటింగ్ చేసానని ఆరోపించిన సజ్జల ఎన్ని కోట్లు తీసుకున్నారని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం పని తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్ లో ఏ పార్టీలో చేరాలనే అంశం పైన అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేసారు.
సీనియర్ ఎమ్మెల్యే ఆనం వైసీపీలో జరిగిన పరిణామాలను వివరించారు. ప్రభుత్వం నాడు సచివాలయాల నిర్మాణాలు సంబంధించిన చెల్లింపుల అంశాన్నే తాను ప్రస్తావించానని గుర్తు చేసారు. జరుగుతున్న అవినీతిని తాను ప్రశ్నించానని..ఆ సమయంలో జగన్ స్వయంగా ఫోన్ చేసారని ఆనం చెప్పుకొచ్చారు. తన స్థానంలో కొత్తగా ఇంచార్జ్ ను నియిమించిన తరువాత తాను దూరంగా ఉన్నానని వివరించారు. సజ్జల చేసిన వ్యాఖ్యల పైన తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయ్యారు. తాను క్రాస్ ఓటింగ్ చేసినట్లు చెబితే ఎన్నికల కమిషన్ చెప్పాలని..వారిని కోరటానికి తాను సిద్దమని స్పష్టం చేసారు. తాను క్రాస్ ఓటింగ్ చేసినట్లు సజ్జల ఎలా చెబుతారని ప్రశ్నించారు.

తన పైన ఆరోపణలు చేసే స్థాయికి సజ్జలకు లేదన్నారు. తాను అధికార పక్షంలో ఉన్నంత మాత్రాన తప్పులు ప్రస్తావన చేయకూడదని ఎక్కడా లేదన్నారు. తనను తప్పించటానికి నాలుగు నెలల క్రితమే కుట్ర జరిగిందని ఆనం ఆరోపించారు. తాను ఎప్పుడూ ప్రభుత్వంలో వ్యక్తిగత పనులు చేయమని కోరలేదన్నారు. తనకు ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ ముందు రోజున చీఫ్ విప్ ప్రసాద రాజు ఫోన్ చేసారని చెప్పారు. ఓటింగ్ కు వస్తున్నారా అని అడిగారని.. ఎవరికి ఓటు వేయాలో మాత్రం చెప్పలేదన్నారు. రాజకీయాల్లో సొంత నిర్ణయాలు ఉండవని చెప్పారు. ప్రజాస్వామ్యంలో వైఎస్సార్ - జగన్ కు మధ్య ఉన్న తేడాను ఆనం వివరించారు. తాను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని..ఇటువంటి ఆరోపణలు ఎప్పుడూ ఎదుర్కోలేదన్నారు.
తాను గతంలోనూ టీడీపీలో పని చేసానని చెప్పారు. భవిష్యత్ ఏంటనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. 2019 ఎన్నికల్లో సమయంలో తాను వైసీపీ దగ్గరకు రాలేదని..తననే వైసీపీలోకి రావాలంటూ ఆహ్వానించారని ఆనం చెప్పుకొచ్చారు. మాజీ మంత్రి అనిల్ తో ఎటువంటి సమస్యలు లేవన్నారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి తన పైన ఆరోపణలు చేయటాన్ని ఆనం ఖండించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎనిమిది సీట్లు వస్తాయని.. ఎవరు ఎన్ని గెలుస్తారో చూడాలన్నారు. తన ఓటు అసలు పరిగణలో లేని సమయంలో..తాను ఎవరికి ఓటు వేస్తే ఎవరికైనా ఎందుకుని ఆనం ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications