చంద్రబాబుతో ఆనం భేటీ, సీటుపై కండీషన్స్ - వైసీపీకి రాజీనామా..!!
వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. వైసీపీ నుంచి సస్పెన్షన్ తరువాత పార్టీ వ్యవహారాలకు దూరమైన ఆనం..ఇప్పుడు పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీకి ఆనంకు లైన్ క్లియర్ అయింది. టీడీపీ అధినేత చంద్రబాబు తో ఆనం సమావేశమయ్యారు. సీటు పైన చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇక పార్టీలో ఎంట్రీ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఈ రోజు తన అనుచరులతో ఆనం సమావేశమై తన నిర్ణయం ప్రకటించనున్నారు.
అధికారికంగా టీడీపీలోకి: నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీ వీడేందుకు సిద్దమయ్యారు. 2019 ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆనం సొంత పార్టీ..పాలన పైన సీరియస్ వ్యాఖ్యలు చేసారు. ఫలితం గా వెంకటగిరి ఎమ్మెల్యేగా ఆనం ఉండగా.. పార్టీ ఇంఛార్జ్ గా నేదురుమల్లి రాం కుమార్ రెడ్డిని నియమిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నెల్లూరు నుంచి ముగ్గురు, తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి క్రాస్ ఓటింగ్ చేసారనే కారణంతో పార్టీ నుంచి సస్పెండ్ చేసారు. ఇప్పటికే ఆనం, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేయటం ఖాయమైంది. మరో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర రెడ్డి గురించి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
ఒక్కరికే ఎమ్మెల్యే సీటు: ఈ సమయంలో హైదరాబాద్ లో చంద్రబాబుతో ఆనం సమావేశమయ్యారు. దాదాపు గంటకు పైగా వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయి. జిల్లాలో రాజకీయ సమీకరణాలు.. వచ్చే ఎన్నికల్లో పోటీ పైన ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వెంకటగిరి నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ఆనంను వచ్చే ఎన్నికల్లో ఆత్మకూరు లేదా నెల్లూరు సిటీ నుంచి పోటీకి దింపాలనేది చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది.
ఆత్మకూరు నుంచి గతంలోనూ ఆనం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. నెల్లూరు సిటీ నుంచి మాజీ మంత్రి నారాయణ పోటీ చేసే అవకాశం ఉందని చెబుతున్నా..ఆనం పేరు పరిశీలనలోకి వచ్చింది. ఎంపీగా ఆనం ను బరిలోకి దింపుతారని ప్రచారం జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్యేగానే పోటీకి దించాలని భావిస్తున్నా..ఆనం కుమార్తె అంశంపైన చర్చ జరిగినట్లు సమాచారం.
వైసీపీకి రాజీనామా దిశగా: ఆనం కుమార్తె కూడా ఈ సారి ఎన్నికల్లో టీడీపీ నుంచి ఆత్మకూరు సీటు ఆశిస్తున్నారు. ఆనం లేదా ఆయన కుమార్తె ఇద్దరికీ సీటు కావాలంటే ఒకరు ఎంపీగా..మరొకరు ఎమ్మెల్యేగా ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. ఎంపీగా పోటీ చేయకుంటే ఇద్దరిలో ఒకరిని ఆత్మకూరు నుంచి పోటీ చేయాలని..నిర్ణయం తీసుకోవాలని..ఒకరికే సీటు సాధ్యమని చెప్పినట్లు సమాచారం.
ఇక, కడప జిల్లాలో లోకేష్ యాత్ర పూర్తి కానుంది. నెల్లూరు జిల్లాలో లోకేష్ యాత్ర వేళ ఘనంగా ఏర్పాట్లు దిశగా ఆనం సిద్దమవుతున్నారు. ఇక పార్టీలో ఉండి ఉపయోగం లేదని..టీడీపీలో ఇప్పుడే చేరితే ఎన్నికల నాటికి పట్టు పెంచుకొనే ఆలోచనలో ఆనం ఉన్నారు. ఆ దిశగా ఈ రోజు జరిగే ముఖ్య అనుచరుల సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. టీడీపీలో అధికారికంగా చేరటం పైన నిర్ణయం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications