Bank of Baroda: కస్టమర్లు అలర్ట్.. వెంటనే మీ పిన్, పాస్‌వర్డ్ మార్చండి!
ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB) కస్టమర్ల వివరాలు నెట్‌లో లీక్ అయ్యాయనే వార్తలు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఒక ఉద్యోగి ఈ-మెయిల్ ఖాతా సైబర్ దాడికి గురికావడంతో కొందరి వ్యక్తిగత సమాచారం బయటకు వచ్చినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. అయితే బ్యాంక్ మెయిన్ లావాదేవీల వ్యవస్థలన్నీ పూర్తిగా సురక్షితంగానే ఉన్నాయని, ఏమాత్రం భయపడాల్సిన పనిలేదని యాజమాన్యం స్పష్టం చేసింది. అయినప్పటికీ, ముందస్తు జాగ్రత్తగా ప్రతీ ఖాతాదారుడు తమ ఖాతాను సురక్షితంగా మార్చుకోవడం చాలా అవసరమని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.
సమాచారం లీక్ అయితే మన అకౌంట్‌కు ప్రమాదమా?
పేర్లు, ఫోన్ నంబర్లు, చిరునామాలు, ఖాతా వివరాలు వంటి సమాచారం లీక్ అయినప్పటికీ, వాటి ద్వారా నేరుగా మీ ఖాతాలోని డబ్బులను ఎవరూ కాజేయలేరు. ఎందుకంటే ఏ లావాదేవీ జరగాలన్నా మీ ఫోన్‌కు వచ్చే ఓటీపీ లేదా పాస్‌వర్డ్ కచ్చితంగా ఉండాలి. కాకపోతే, ఈ సమాచారాన్ని వాడుకుని సైబర్ కేటుగాళ్లు మీకు బ్యాంక్ అధికారులలా ఫోన్ చేసి, నమ్మబలికి ఓటీపీలు అడిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఎవరికీ మీ వివరాలు చెప్పకపోవడమే అత్యంత సురక్షితం.

నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్ ఇలా మార్చుకోండి...
మీ నెట్ బ్యాంకింగ్ ఖాతాను రక్షించుకోవడానికి వెంటనే పాస్‌వర్డ్ మార్చడం మొదటి సరియైన అడుగు.
- బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక 'bob World' ఇంటర్నెట్ బ్యాంకింగ్ పోర్టల్‌లోకి వెళ్లి మీ యూజర్ ఐడీ, పాత పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వండి.
- 'ప్రొఫైల్' లేదా 'క్విక్ లింక్స్' విభాగంలో 'చేంజ్ పాస్‌వర్డ్' ఆప్షన్ ఎంచుకోండి.
- మీ పాత పాస్‌వర్డ్‌తో పాటు, కనీసం ఒక క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, నంబర్ మరియు స్పెషల్ క్యారెక్టర్‌తో (ఉదాహరణకు: Abcd@1234) కూడిన కొత్త పాస్‌వర్డ్‌ను సెట్ చేసుకోండి.
- మీ రిజిస్టర్డ్ మొబైల్‌కు వచ్చే ఓటీపీని నమోదు చేసి ప్రాసెస్ పూర్తి చేయండి.
- ఒకవేళ మీరు పాత పాస్‌వర్డ్ మర్చిపోతే, లాగిన్ పేజీలోనే 'సెట్/రీసెట్ పాస్‌వర్డ్' పై క్లిక్ చేసి ఓటీపీ ద్వారా సులభంగా కొత్తది క్రియేట్ చేసుకోవచ్చు.
- డెబిట్, క్రెడిట్ కార్డ్ పిన్ (PIN) రీసెట్ చేసే విధానం...
కార్డుల భద్రత కోసం పిన్ నంబర్ మార్చడం చాలా తేలిక.
- bob World యాప్ ద్వారా: యాప్‌లో 'కార్డ్స్' విభాగానికి వెళ్లి డెబిట్ కార్డ్‌ని ఎంచుకుని, 'సెట్ పిన్' లేదా 'చేంజ్ డెబిట్ కార్డ్ పిన్' ద్వారా ఓటీపీ నమోదు చేసి కొత్త 4 అంకెల పిన్‌ను సెట్ చేసుకోవచ్చు.
- ఏటీఎంలో: నేరుగా బరోడా ఏటీఎమ్‌కి వెళ్లి కార్డు ఉంచి, 'పిన్ జనరేషన్' ఆప్షన్ ద్వారా మొబైల్ ఓటీపీని నమోదు చేసి కొత్త పిన్ క్రియేట్ చేయవచ్చు.
- క్రెడిట్ కార్డ్ పిన్: BOB Financial పోర్టల్‌లో లాగిన్ అయ్యి 'సర్వీస్ రిక్వెస్ట్' ద్వారా లేదా బ్యాంక్ టోల్ ఫ్రీ నంబర్లు 1800 258 4455 / 1800 102 4455 కు కాల్ చేసి పిన్ రీసెట్ చేసుకోవచ్చు.
కస్టమర్లు వహించాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు!
మీ అకౌంట్‌లో జరిగే ప్రతీ చిన్న లావాదేవీని ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్‌లు లేదా లింక్‌లను అస్సలు నమ్మవద్దు. బ్యాంక్ అధికారులు ఎప్పుడూ మీ ఓటీపీలు, పిన్ నంబర్లు లేదా వ్యక్తిగత సమాచారాన్ని ఫోన్లలో అడగరనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఏమాత్రం అనుమానాస్పద లావాదేవీలు కనిపిస్తే వెంటనే సంబంధిత బ్యాంక్ బ్రాంచ్‌ను గానీ, సైబర్ క్రైమ్ నెట్‌వర్క్‌ను గానీ సంప్రదించాలి.












Click it and Unblock the Notifications