అసెంబ్లీలో కోటంరెడ్డి వర్సస్ మంత్రులు - ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ..!!
వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిరసనకు దిగారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ పైన కీలక వ్యాఖ్యలు చేసారు.
వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిరసనకు దిగారు. పార్టీ - ప్రభుత్వ తీరును నిరిసిస్తూ వైసీపీకి దూరమైన కోటంరెడ్డి ఈ రోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. సమావేశాలకు హాజరయ్యే క్రమంలో ప్లకార్డుతో బయట నిరసన తెలిపారు.తన నియోజకవర్గంలోని సమస్యల ప్ల కార్డులను ప్రదర్శిస్తూ అసెంబ్లీకి పాదయాత్రగా వెళ్లారు. ప్లకార్డు ప్రదర్శన వద్దంటూ కోటంరెడ్డిని పోలీసులు అడ్డుకునే యత్నం చేశారు. దీనిని కోటంరెడ్డి తప్పు బట్టారు. తనను అడ్డుకునే హక్కు పోలీసులకు లేదంటూ సమావేశాలకు హాజరయ్యారు.

కోటంరెడ్డి నిరసన -అమరావతి వాసుల మద్దతు
తన నియోజకవర్గ సమస్యలపైన మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోటంరెడ్డి నిరసనకు దిగారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తన నిరసన కొనసాగుతుందని స్పష్టం చేసారు. నాలుగేళ్ల కాలంలో సమస్యల పరిష్కారం కోసం తిరిగి తిరిగి విసిగిపోయానని చెప్పుకొచ్చారు. తన నియోజకవర్గ సమస్యలు ప్రస్తావించేందుకు మైక్ ఇచ్చే వరకు అడుగుతూనే ఉంటానని చెప్పారు. అదే విధ:గా తనకు మాట్లాడేందుకు మైక్ ఇవ్వకుంటే నిలబడి నిరసన కొనసాగిస్తానని స్పష్టం చేసారు. కోటంరెడ్డికి అసెంబ్లీకి హాజరయ్యే సమయంలో అమరావతి స్థానికులు పచ్చ కండువా కప్పి తమ మద్దతు ప్రకటించారు. ప్లకార్డుతోనే అసెంబ్లీలోకి వెళ్లేందుకు కోటంరెడ్డి ప్రయత్నించారు.

సభలోనూ నిరసన..అంబటి కౌంటర్
సభలోనూ కోటంరెడ్డి నిరసన కొనసాగించారు. సమస్యలను పరిస్కరిస్తే తానే ముఖ్యమంత్రి ని అభినందిస్తానన్నారు. కోటంరెడ్డి పైన మంత్రి అంబటి కీలక వ్యాఖ్యలు చేసారు. శ్రీధర్ రెడ్డి కావాలనే రగడ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో హౌస్‌ను ఇబ్బందిపెట్టి ప్రజల దృష్టిలో పడాలని చూస్తున్నారన్నారు. శ్రీధర్ రెడ్డి తెలుగుదేశంతో చేతులు కలిపి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. శ్రీధర్ రెడ్డి నమ్మక ద్రోహి అని..ఆయన్ను క్షమించవద్దని డిమాండ్ చేసారు. అవసరం అయితే శ్రీధర్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని అంబటి సూచించారు. కోటంరెడ్డి మాత్రం సభలో నిలబడి ప్లకార్డు ప్రదర్శిస్తూ తన నిరసన కొనసాగించారు. కోటంరెడ్డి తీరు పైన సభలో అటు ప్రభుత్వం..ఇటు స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ పైనా..
ఈ నెల 23న ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో టీడీపీ బరిలో నిలిచింది. ఏడుగురు అభ్యర్ధులు వైసీపీ నుంచి నామినేషన్లు దాఖలు చేసారు. ఒక్కో అభ్యర్ధికి 23 మంది సభ్యుల మద్దతు అవసరం. టీడీపీ నుంచి ప్రస్తుతం అధికారికంగా 23 మంది ఉన్నా.. కొందరు వైసీపీతో టచ్ లో ఉన్నారు. ఇదే సమయంలో కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన అంతరాత్మ ప్రభోదానుసారమే ఓటు వేస్తానని తెలిపారు. వైసీపీ ఇతర ఎమ్మెల్యేలు కూడా వారి వారి అంతరాత్మ ప్రభోదానుసారం ఓటు వేస్తారని భావిస్తున్నా నన్నారు. దీంతో..కోటంరెడ్డి అభిప్రాయం ఏంటనేది స్పష్టం అవుతోంది. ఇదే సమయంలో ఆనం ఏం చేస్తారనే అంశంతో పాటుగా టీడీపీ రెబల్స్ ఓటింగ్ విషయం పైనా ఆసక్తి కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications