అచ్చెన్నాయుడికి ధైర్యం ఉంటే - ప్రసన్న కుమార్ రెడ్డి సవాల్..!!
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల తరువాత పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఒక్క సీటు గెలిచిన టీడీపీ అధికార పార్టీ పైన మానసికంగా పైచేయి సాధించే ప్రయత్నం చేస్తోంది. టీడీపీకి క్రాస్ ఓటింగ్ చేసారనే కారణంగా నలుగురు ఎమ్మెల్యేలను వైసీసీ సస్పెండ్ చేసింది. ఆ నలుగురు తాము క్రాస్ ఓటింగ్ చేయలేదని వాదిస్తున్నారు. ఈ నలుగురిని టీడీపీ ప్రలోభాలకు గురి చేసిందని వైసీపీ ఆరోపిస్తోంది. ఇదే సమయంలో అసలు ఆ నలుగురే కాదు..40 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని అచ్చెన్నాయుడు ప్రకటించారు. దీని పైన వైసీపీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి స్పందించారు.
టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తమతో 40 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని చెప్పటం పైన ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సీరియస్ అయ్యారు. దమ్ముంటే వారి పేర్లు బయట పెట్టాలని అచ్చెన్నాయుడును సవాల్ చేసారు. ఇదంగా చంద్రబాబు ఆడుతున్న మైండ్ గేమ్ గా కొట్టి పారేసారు. ఎమ్మెల్యేలు వచ్చేస్తున్నారంటూ ఒక పెద్ద నాటకానికి తెరతీస్తున్నారని దుయ్యబట్టారు. నెల్లూరు జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి వ్యతిరేకం అయ్యారని..తన లాంటి వారు కూడా పార్టీ మారుతున్నారంటూ టీడీపీ మద్దతు మీడియా ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. తాను చివరి నిమిషం వరకు జగన్ తోనే ఉంటానని తేల్చి చెప్పారు. తన కుమారుడు కూడా వైసీపీలోనే కొనసాగుతారని స్పష్టం చేసారు.

తాను ఆరు సార్లు ఎమ్మెల్యేగా పని చేసానని తనను జగన్ ఎంతో ఆప్యాయంగా చూస్తారని చెప్పుకొచ్చారు. ఇప్పటికే నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర రెడ్డి వైసీపీకి దూరం అయ్యారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలవదంటూ మేకపాటి చెప్పుకొచ్చారు. ఉదయగిరిలో తన స్థానంలో ఎవరు నిలబడినా ఓడిపోతారని చెబతున్నారు. దీనిని వైసీపీ నేతలు ఖండించారు. మాజీ మంత్రి అనిల్ పైన మేకపాటి కీలక వ్యాఖ్యలు చేసారు. అనిల్ కు టికెట్ రాదని, వచ్చినా గెలవరని చెప్పుకొచ్చారు. దీనికి అనిల్ కౌంటర్ ఇచ్చారు. ఇక, ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ కుమార్ రెడ్డి తాను వైసీపీలో నే కొనసాగుతానని.. జగన్ నాయకత్వంలోనే పని చేస్తానని స్పష్టం చేసారు. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు విక్రమ్.. ప్రసన్న కుమార్ రెడ్డి తాము వైసీపీలోనే ఉంటామని తేల్చి చెప్పారు.













Click it and Unblock the Notifications