నారీ భేరి.. నారా వారి కర్ణభేరిలో రీసౌండ్ రావాలి: ఎమ్మెల్యే రోజా
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజయవాడలో ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపు 15 వేల మందికి పైగా మహిళలు ఈ సభలో పాల్గొంటున్నారు.

రాష్ట్రంలో మహిళా సాధికారత విజయోత్సవంగా మహిళా దినోత్సవ వేడుకలు
రాష్ట్రంలో మహిళా సాధికారత విజయోత్సవంలో భాగంగా ఈ సభను నిర్వహిస్తున్నట్లు గా మంత్రి తానేటి వనిత, మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో మహిళా సాధికారత కోసం ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలను ఈ సభా వేదికగా ప్రస్తావిస్తున్నారు వైసిపి మహిళా ప్రజాప్రతినిధులు. ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ రాష్ట్ర మహిళా కమిషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రుల నుంచి గ్రామ స్థాయి ప్రజాప్రతినిధులు, సాధారణ మహిళల వరకు విశేషంగా పాల్గొంటున్నారు.

మహిళా సాధికారత కోసం జగనన్న పథకాలు : తానేటి వనిత
అంతర్జాతీయ మహిళా దినోత్సవం కోసం నిర్వహిస్తున్న సభలో ఏపీ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత సీఎం జగన్ మోహన్ రెడ్డిని కొనియాడారు. మహిళా సాధికారత కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ఏపీ సీఎం వైఎస్ జగన్ కు దక్కుతుందని మంత్రి తానేటి వనిత వెల్లడించారు. మహిళలను లక్షాధికారులను చేయాలని మహానేత వైయస్ఆర్ కలలు కనేవారని ఆమె గుర్తు చేశారు. తండ్రి ఆశయసాధనకు తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని మంత్రి తానేటి వనిత వెల్లడించారు.

చంద్రబాబు మహిళలను దగా చేశారు: తానేటి వనిత
చంద్రబాబు మహిళలను దగా చేశాడని పేర్కొన్న వనిత మహిళా సాధికారత జగనన్న వల్లే సాధ్యమైందని పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభకు ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఆమె తన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జగన్ సీఎం అయ్యాక మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడటం కోసం పలు పథకాలను తీసుకువచ్చి మహిళా సాధికారత అంటే ఏంటో చూపించారని ఆమె అన్నారు.

సీఎం జగన్ లాంటి మహిళా పక్షపాతి దేశంలోనే ఉండరు: ఎమ్మెల్యే రోజా
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న సభలో నగరి ఎమ్మెల్యే రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి మహిళా పక్షపాతి అని రోజా వ్యాఖ్యానించారు. సీఎం జగన్ లాంటి మహిళా పక్షపాతి దేశంలోనే ఉండరని ఆమె పేర్కొన్నారు. నారీ భేరి సౌండ్ నారావారి కర్ణ భేరిలో రీసౌండ్ రావాలని ఎమ్మెల్యే రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహిళా దినోత్సవం నాడు కూడా టీడీపీని టార్గెట్ చేశారు.
Recommended Video

మహిళా బాగుంటే కుటుంబం బాగుంటుందని నమ్మే వ్యక్తి జగన్ : ఎమ్మెల్యే రోజా
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మహిళలను మహారాణులు చేశారని గుర్తు చేశారు. మహిళా సాధికారతను ఆచరణలో పెట్టి చూపించారని ఎమ్మెల్యే రోజా అభిప్రాయం వ్యక్తం చేశారు. మహిళ బాగుంటే కుటుంబం బావుంటుంది అని నమ్మే వ్యక్తి సీఎం జగన్ అని ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. అందుకే మహిళలకు ఎన్నో పథకాలు అందించి వారి ఆర్ధిక స్వావలంబనకు కృషి చేశారని ఎమ్మెల్యే రోజా వెల్లడించారు. సీఎం జగన్ మహిళలందరికీ దేవుడితో సమానం అని రోజా మహిళా దినోత్సవం సాక్షిగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications