ఎంపీ రఘురామ రాజుకు సిట్ నోటీసులు - ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కొత్త ట్విస్ట్..!!
రాజకీయ సంచలనానికి తెర లేపిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇందులో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజు పేరు తెర పైకి వచ్చింది. ఇప్పటికే ఫాం హౌస్ లో చోటు చేసుకున్న ఎమ్మెల్యే బేరసారాలకు సంబంధించిన వీడియోలను సీఎం కేసీఆర్ విడుదల చేసారు. సుప్రీం - అన్ని రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులతో పాటుగా అన్ని రాజకీయ పార్టీలకు వీటిని పంపారు. ఈ కేసు విచారణకు ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేసారు. బీజేపీ ముఖ్య నేత బీఎల్ సంతోష్ పైన కేసు నమోదు చేసారు. తాజాగా, ఈ కేసులో ఎంపీ రఘురామ రాజుకు సిట్ నోటీసులు జారీ చేసింది.

అనూహ్యంగా తెర పైకి రఘురామ పేరు
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇప్పుడు అనూహ్యంగా వైసీపీ నర్సాపురం ఎంపీ రఘురామ రాజు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసును విచారిస్తున్న సిట్ ఇప్పటికే బీజేపీ ముఖ్య నేత బీఎల్ సంతోష్ కు విచారణకు హాజరవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది. దీని పైన బీజేపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. బీఎల్ సంతోష్ కు నోటీసులు ఇచ్చేందుకు సహకరించాల్సిందిగా ఢిల్లీ పోలీసులను హైకోర్టు గతంలో ఆశ్రయించింది. అయితే, ఈ నెల 16వ తేదీ నుంచి ఆయనకు నోటీసులు అందించే ప్రయత్నం చేస్తున్నామని సిట్ హైకోర్టుకు నివేదించింది. దీంతో, ఈ మెయిల్ ద్వారా నోటీసులు సర్వ్ చేయాలని హైకోర్టు సూచించింది. ఇదే సమయంలో తమ అనుమతి లేకుండా బీఎల్ సంతోష్ ను అరెస్ట్ చేయవద్దని కోర్టు స్పష్టం చేసింది.

నిందితులు గతంలో కలిసారంటూ
ఇటు దర్యాప్తులో భాగంగా విచారణకు సహకరించని నేతల పై కేసుల నమోదు దిశగా సిట్ అడుగులు వేస్తోంది. తాజాగా బీఎల్ సంతోష్ కు నోటీసులు జారీ చేసిన సిట్ ఈ నెల 26 లేదా 28న విచారణకు హాజరు కావాలని సూచించింది. ఇదే కేసులో ఎంపీ రఘురామ రాజుకు 41ఏ సీఆర్పీసీ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఫామ్ హౌస్ నిందితులను గతంలో రఘురామ కలిసినందుకు ఈ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఈ నెల 26 లేదా 28వ తేదీన రఘురామ సిట్ ముందు విచారణకు హాజరు కావాలని నోటీసులో సూచించినట్లు చెబుతున్నారు. మరో వైపు హైకోర్టులో ఈ కేసుకు సంబంధించి పలు పిటీషన్లు విచారణలో ఉన్నాయి. హైకోర్టు తాజా ఆదేశాల మేరకు బీఎల్ సంతోష్ కు ఇప్పుడు సిట్ తాజా నోటీసులు జారీ చేయటంతో ఆయన హాజరు పైన సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది.

రఘురామను విచారణకు హాజరు కావాలంటూ
విచారణకు సహకరించాలని కోర్టు ఇప్పటికే బీఎల్ సంతోష్ తరపు న్యాయవాదులకు స్పష్టం చేసింది. ఇక, ఇదే కేసులో కేరళ స్వామితో పాటుగా తుషార్ కు సిట్ నోటీసులు ఇచ్చింది. ఇదే కేసులో ఇద్దరి పైన లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. సిట్ ఈ కేసును లోతుగా అధ్యయనం చేయటంతో పాటుగా.. ఏ ఒక్క చిన్న అవకాశాన్ని విచారణ సమయంలో విస్మరించటం లేదు. వచ్చే వారం ఈ కేసు విచారణలో మరింత కీలకం కానుంది. హైకోర్టులో 30వతేదీన మరోసారి ఈ వ్యవహారం విచారణకు రానుంది. అటు రాజకీయంగానూ ఈ కేసు జాతీయ స్థాయిలో చర్చకు కారణమవుతోంది. రోజుకో కొత్త పేరు ఈ కేసు వ్యవహారంలో బయటకు వస్తుండటంతో మొత్తం పరిణామాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications