డైలమా: కిరణ్ మనసులో ఏముందో, చివరికి చెయ్యిస్తే!?
హైదరాబాద్: విభజనపై సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ ప్రజాప్రతినిధుల మైండ్ సెట్‌ను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు ముందు తెలుసుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ప్రజాప్రతినిధులు, మంత్రులు సైతం కిరణ్ మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారట.
అసెంబ్లీకి తెలంగాణ బిల్లు వస్తే ఎంతమంది దానిని వ్యతిరేకించేందుకు కలిసి వస్తారని తెలుసుకునేందుకు కిరణ్ జిల్లాల వారీగా ప్రజాప్రతినిధులతో సమావేశాలకు ముందు భేటీ కావాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కిరణ్ కొత్త పార్టీ కోసమే అలాంటి ప్రయత్నాలు చేసేందుకు సిద్ధమయ్యారా అనే చర్చ సాగుతోంది.

అసెంబ్లీలో తెలంగాణ బిల్లును ఎంతమంది వ్యతిరేకిస్తారనే భేటీని కిరణ్ తనకు మద్దతుగా ఎవరెవరు నిలబడతారు, పార్టీ పెడితే ఎంతమంది వస్తారనే విషయాన్ని తెలుసుకునేందుకు ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారా? అనే కోణంలో చర్చ సాగుతోందట.
కిరణ్ ఇప్పటి వరకు కొత్త పార్టీ పైన ఎలాంటి హింట్ ఇవ్వలేదు. అయినప్పటికీ కొత్త పార్టీపై జోరుగా ప్రచారం సాగుతున్నందున ఆయన స్టాండ్‌ను తెలుసుకునే ప్రయత్నాలు ఎమ్మెల్యేలు, మంత్రులు చేస్తున్నారట. కొత్త పార్టీ పైన కిరణ్ నుండి స్పష్టమైన హామీ వస్తే మంచిదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అయితే, అధిష్టానం నిర్ణయానికి తలొగ్గి చివరి నిమిషంలో ముఖ్యమంత్రి విభజనకు వంత పాడితే ఎలా అనే చర్చ కూడా సాగుతోందట.
2014 వరకు విభజన సాధ్యం కాదని కిరణ్ భావిస్తున్నారంటున్నారు. ఒకవేళ అధిష్టానం ముందుకు వెళ్తే మాత్రం రాజీనామా చేసి కొత్త పార్టీ పెట్టే అవకాశం లేకపోలేదని కొందరు అంటుంటే, మరికొందరు కిరణ్ కాంగ్రెసుకు విశ్వాసపాత్రుడని చెబుతున్నారు.
కిరణ్ కొత్త పార్టీ పైన తాము మీడియాలోనే చూస్తున్నామని సోమవారం మంత్రి శైలజానాథ్ చెప్పగా, ఆయన పార్టీని ఎట్టి పరిస్థితుల్లో వీడరని మరో మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. కొత్త పార్టీపై ఇప్పటికే పలువురు సీమాంధ్ర నేతలు కిరణ్‌ను అడిగినప్పటికీ ఆయన యస్ అని గానీ, నో అని గానీ చెప్పలేదట.












Click it and Unblock the Notifications