కుర్చీలెక్కి కోతుల్లా ఎగిరారు: వైసిపి ఎమ్మెల్యేలపై చంద్రబాబు, రోజాపైనా విసుర్లు
సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుని ముందుకెళ్లాలని ఈ సందర్బంగా చంద్రబాబు పార్టీ శ్రేణులకు అధినేత చంద్రబాబు సూచించారు.
విజయవాడ: ఎమ్మెల్యేలే కుర్చీలు ఎక్కి కోతుల్లా ఎగరటం చూసి బాధకలిగిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలు మైకులు విరగ్గొట్టారని సీఎం చంద్రబాబునాయుడు మండిపడ్డారు.
ఇప్పుడు ఆ పరిస్థితి రాకూడదనే మైక్రోఫోన్లు ఏర్పాటు చేశామని చంద్రబాబు చెప్పారురు. చెవిలో దూది పెట్టుకున్నా వినలేనంతగా ఓ మహిళ మాట్లాడుతున్నారని చంద్రబాబు రోజాను ఉద్దేశించి విమర్శించారు. వాళ్ల భాష, వేషాలు చూస్తే కంపరం పుడుతోందని ఆయన అన్నారు.
ఇంతకుముందు ప్రకటించినట్లు గానే కడప జిల్లా రైల్వే కోడూరు కాంగ్రెస్ ఎమ్మెల్సీ చెంగల్రాయుడు బుధవారం నాడు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. విజయవాడలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. చెంగల్రాయుడితో పాటు పలువురు అనుచరులు, మద్దతుదారులు సైతం టీడీపీలో చేరారు.
చెంగల్రాయుడు చేరిక సందర్బంగా పార్టీని ఉద్దేశించి అధినేత చంద్రబాబు మాట్లాడారు. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుని ముందుకెళ్లాలని ఈ సందర్బంగా చంద్రబాబు పార్టీ శ్రేణులకు సూచించారు. తెలుగు ప్రజలు అభివృద్ధే తన ధ్యేయమని, వారెప్పుడూ అగ్రభాగాన నిలబడాలన్నదే తన ఆశయమని చంద్రబాబు పేర్కొన్నారు.

ఇందుకోసం పార్టీలో అందరు కష్టపడి పనిచేయాలని, సమిష్టిగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇక తమ పాలన గురించి వివరిస్తూ.. ఏడాది కాలంలోనే నదుల అనుసంధానం చేయగలిగినట్టు చంద్రబాబు చెప్పారు. గోదావరి నీళ్లు కృష్ణాకు వస్తున్నాయని అన్నారు. కృష్ణా డెల్టాకు ఉపయోగించే నీళ్లను శ్రీశైలంలో నిల్వ చేసి రాయలసీమకు తీసుకువస్తున్నామని చెప్పుకొచ్చారు.
వైసీపీ మీద విమర్శలు:
కాంగ్రెస్ ఎమ్మెల్సీ చెంగల్రాయుడు చేరిక సందర్బంగా టీడీపీని ఉద్దేశించి మాట్లాడిన అధినేత చంద్రబాబు ప్రతిపక్ష వైసీపీ మీద విమర్శలు గుప్పించారు. గత అసెంబ్లీలో ప్రతిపక్ష నేతలు మైకులు విరగొట్టడం వంటివి చూసి తనకు బాధేసిందని అన్నారు.
వైసీపీ ఎమ్మెల్యేలంతా కుర్చీలు ఎక్కి కోతుల్లా ఎగిరారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. చెవుల్లో దూదిపెట్టుకున్నా సరే భరించలేని విధంగా ఓ మహిళ మాట్లాడుతోందని పరోక్షంగా ఎమ్మెల్యే రోజాపై ఆయన కౌంటర్ వేశారు.
తన జీవితంలో ఇంతగా ఎప్పుడూ బాధపడలేదని, మరోసారి ఇలాంటి ఘటనలు జరగకూడదని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. అమరావతిలో అసెంబ్లీని కట్టుదిట్టంగా తయారుచేస్తున్నామని పేర్కొన్నారు.
తమిళనాడు రాజకీయాలను ఉటంకిస్తూ శశికళ లాంటి వారు మన రాష్ట్రంలోను ఉన్నారని చంద్రబాబు నాయుడు అన్నారు. అలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండాల్సిన అవసరముందా? అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో ఉన్న అక్రమార్కులు శశికళ కాజేసిన దానికన్నా ఎక్కువగా నల్లధనాన్ని పోగేశారని ఆరోపించారు. రాజకీయాల్లో పేరుకుపోతున్న అవినీతిపై సుప్రీం కోర్టు కూడా విచారం వ్యక్తం చేసిందని చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు.
ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించిన సీఎం
బుధవారం ఉదయం 9.28నిమిషాలకు పీఎస్ఎల్వీ-సీ37లోకి 104 ఉపగ్రహాలను తీసుకెళుతూ నింగిలోకి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. దీనిపై సీఎం చంద్రబాబు స్పందించారు. 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించడం ద్వారా ఇస్రో రికార్టు సృష్టించిందని చంద్రబాబు కితాబిచ్చారు. ఈ ఘనత సాధించిన ఇస్రో శాస్త్రవేత్తలకు ఆయన అభినందనలు తెలియజేశారు.












Click it and Unblock the Notifications