లోకేష్ యువగళం కు బ్రేక్ - నిర్ణయం పై ఉత్కంఠ..!?
లోకేష్ యువగళం కు బ్రేక్ పడుతుందా.. కొనసాగుతుందా. నేడు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.
టీడీపీ యువ నేత నారా లోకేష్ పాదయాత్ర యువగళం కొనసాగుతుందా. తాత్కాలిక బ్రేక్ పడనుందా. ఇప్పుడు ఇది ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. యువగళం తో పాటుగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న గడప గడపకు ప్రభుత్వం నిర్వహణ పైన సందేహాలు కొనసాగుతున్నాయి. దీని పైన ఇప్పుడు అధికారుల్లో చర్చ సాగుతోంది. ఇదే అంశం పైన తాజాగా చిత్తూరు జిల్లా కలెక్టర్ సందేహం వ్యక్తం చేసారు. ఎన్నికల సంఘానికి లేఖ రాసారు. దీని పైన ఎన్నికల సంఘం తీసుకొనే నిర్ణయం పైన రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది.

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఎఫెక్ట్
ఏపీలో స్థానిక సంస్థలు, పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటనతో వెంటనే కోడ్ అమల్లోకి వచ్చింది. ఇదే సమయంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణన్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) ముఖేశ్ కుమార్ మీనాకు రాసిన లేఖ ఇప్పుడు చర్చకు కారణమవుతోంది. లోకేష్ కొనసాగిస్తున్న యువగళం యాత్ర ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. అదే సమయంలో గడప గడపకు ప్రభుత్వం పేరుతో వైసీపీ నేతలు ప్రతీ ఇంటికి వెళ్తున్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా కుటుంబాల వారీగా చేసిన మేలును వివరిస్తూ కరపత్రాల రూపంలో ఇంటింటికీ వెళ్లి అందజేస్తున్నందున అది ఎన్నికలను ప్రభావితం చేస్తుందని అధికారులు భావిస్తున్నారు. లోకేశ్ సైతం పాదయాత్ర సందర్భంగా తమ ప్రభుత్వం వస్తే మంచి చేస్తామంటూ పలు హామీలు ఇస్తున్నారు. ఇదీ ఎన్నికలను ప్రభావితం చేస్తుందని యంత్రాంగం భావిస్తోంది. దీంతో..కోడ్ సమయంలో వీటి నిర్వహణ పైన క్లారిటీ కోరుతూ ఈ లేఖ రాసారు.

ఎన్నికల సంఘం నిర్ణయంపై ఉత్కంఠ
ఇప్పుడు లోకేష్ యువగళం నిర్వహణ.. వైసీపీ నేతలు కొనసాగిస్తున్న గడప గడపకు ప్రభుత్వం అసలు ఎన్నికల కోడ్ పరిధిలోకి వస్తాయా రావా అనే చర్చ సాగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వీటి నిర్వహణకు అడ్డంకిగా మారుతుందా అనే అంశం పైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాధారణ ఓటర్లు ఓటింగ్ అవకాశం ఉండదని..ఈ సమయంలో పాదయాత్ర..ప్రచారం కోడ్ పరిధిలోకి రావని కొందరు అభిప్రాయపడుతున్నారు. కానీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్లు.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు ఓటర్లుగా ఉండటంతో..వారిని ఆకర్షించే ప్రచారాలు కూడా కోడ్ పరిధిలోకి వస్తాయని కొందరు సీనియర్ అధికారులు చెబుతున్నారు. కానీ, స్థానిక సంస్థల కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం లోకేష్ యాత్ర.. ప్రభుత్వ కార్యక్రమ ప్రభావం ఉండే అవకాశం ఉండదని చెబుతున్నారు. టీచర్ ..గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే జిల్లాల్లో వీటి నిర్వహణ పైన ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఈసీ నిర్ణయిస్తే..తాత్కాలిక బ్రేక్..!
ఇప్పుడు చిత్తూరు కలెక్టర్ వ్యక్తం చేసిన సందేహం పైన ఎన్నికల సంఘం ఇచ్చే క్లారిటీ కీలకం కానుంది. పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఇప్పటికే పార్టీ తరపున అభ్యర్ధులు బరిలో ఉన్నారు. గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల ఎన్నికలు దాదాపుగా తొమ్మది ఉమ్మడి జిల్లాల్లో జరగనున్నాయి. అందులో చిత్తూరు జిల్లా కూడా ఉంది. అదే విధంగా ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎన్నికలు ఆరు జిల్లాల్లో జరగుతున్నాయి. అందులోనూ చిత్తూరు జిల్లా ఉంది. దీంతో..చిత్తూరు జిల్లాలో లోకేష్ యాత్ర పైన ఎన్నికల సంఘం నిర్ణయం ఎలా ఉంటుందనేది చూడాలి. గడప గడపకు ప్రభుత్వం అన్ని జిల్లాల్లోనూ కొనసాగుతోంది. ఇప్పుడు చిత్తూరు జిల్లా కలెక్టర్ లేఖ ఆధారంగా ఎన్నికల సంఘం తీసుకొనే నిర్ణయం ఆధారంగా యువగళం కొనసాగుతుందా.. లేక తాత్కాలిక బ్రేక్ తప్పదా అనేది క్లారిటీ రానుంది. దీంతో..ఇప్పుడు ఎన్నికల సంఘం నిర్ణయం కోసం టీడీపీ - వైసీపీ ఆసక్తిగా ఉన్నాయి.












Click it and Unblock the Notifications