ఏపీకి వర్ష సూచన
Heavy Rains in AP: బంగాళాఖాతంలో నైరుతి ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనంగా బలహీనపడింది. దీని ఫలితంగా ఏపీలోని పలు జిల్లాల్లో వచ్చే 48 గంటల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ అల్పపీడనం వల్ల దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది.
అల్పపీడన ప్రభావంతో శుక్ర, శని వారాల్లో పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, అనంతపురం, సత్యసాయి పుట్టపర్తి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి అధిక వర్షపాతం నమోదైంది. 24 గంటల వ్యవధిలో దక్షిణ కోస్తా తీర ప్రాంత జిల్లాలపై అల్పపీడన ప్రభాం అధికంగా కనిపించింది.

ఇదే తీవ్రత నేడు కూడా ఉంటుందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం పడొచ్చని పేర్కొంది. అక్కడక్కడ పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
విపత్తు నిర్వహణ సంస్థ అంచనాల ప్రకారం- దక్షిణ కోస్తా తీర ప్రాంతంలోని ప్రకాశం, నెల్లూరుతో పాటు రాయలసీమ జిల్లాలు- నంద్యాల, కడప, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే- అనంతపురం, శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయి.
శనివారం నాడు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు పడ్డాయి. వర్షాల వల్ల తిరుమలలో పొగమంచు అలముకుంది. వాతావరణం ఆహ్లాదకరంగా మారింది.












Click it and Unblock the Notifications