బంగాళాఖాతంలో మళ్లీ ఉపరితల ఆవర్తనం- ఏపీకి వర్షాలు
Heavy rains: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావం వల్ల కొద్దిరోజులుగా ఏపీలో భారీ వర్షాలు కురిశాయి. పలు జిల్లాల్లో దంచికొట్టాయి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు విస్తారంగా వర్షలు పడ్డాయి. ప్రత్యేకించి- కోస్తా జిల్లాలపై దీని తీవ్రత అధికంగా కనిపించింది. చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజీ లక్షల క్యూసెక్కుల మేర వరద నీటిని డిశ్చార్జ్ చేశాయి.
ఇప్పుడు తాజాగా బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ఫలితంగా ఏపీలో మరో విడత విస్తారంగా వర్షాలు పడనున్నాయి. దీని ప్రభావంతో సోమవారం అల్లూరి సీతారామరాజు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కడప, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓమోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఉరుములు,మెరుపులతో వర్షాలు పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఈ రాత్రికి, రేపు ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ జిల్లాల వరకు అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షపాతం నమోదు కావొచ్చు. గుంటూరు, బాపట్ల, పల్నాడు బెల్ట్ లో అక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడొచ్చని ఎస్డీఎంఏ అంచనావేసింది. ద్రోణి ప్రభావంతో రానున్న రెండు రోజులు రాయలసీమలో ఒకటి, రెండు చోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.
ఈ రాత్రికి శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు. పిడుగుల పడే సమయంలో చెట్ల క్రింద నిల్చోకూడదని సూచించారు. భారీ వర్షాలు పడేటప్పుడు, ఈదురుగాలులు వీచేటప్పుడు హోర్డింగులు, శిథిలావస్థలో ఉన్న భవనాలు, గోడల వద్ద తలదాచుకోవద్దని, అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications