నైరుతి రుతుపవనాలకు లైన్ క్లియర్! బంగాళాఖాతంలో అల్పపీడనం
ఎండ వేడిమితో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలకు అమరావతి వాతావరణ కేంద్రం చల్లని కబురు అందించింది. ఈ వారం చివరి నాటికి దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం , అండమాన్ & నికోబార్ దీవులలోని కొన్ని ప్రాంతాలలో నైరుతి రుతుపవనాల ప్రవేశానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాగల మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు (మే 12) ఉదయం అదే ప్రాంతంలో కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఇది రాగల 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు, నైరుతి బంగాళాఖాతంలోని అల్పపీడన కేంద్రం నుండి ఉత్తర తమిళనాడు, రాయలసీమ, ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా మరాఠ్వాడా వరకు ద్రోణి విస్తరించి ఉంది.

ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వాతావరణ మార్పులు ఇలా ఉండనున్నాయి
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:
నేడు, రేపు ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. ఎల్లుండి గాలి వేగం పెరిగి గంటకు 40-50 కిలోమీటర్ల వరకు ఉండవచ్చు.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:
నేడు , రేపు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురు గాలులతో (40-50 కి.మీ/గం) కూడిన జల్లులు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
రాయలసీమ:
నేడు, రేపు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉండగా, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు , 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.
ఉష్ణోగ్రతల పరిస్థితి
రాగల ఐదు రోజుల్లో కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం , రాయలసీమ ప్రాంతాలలో గరిష్ట ఉష్ణోగ్రతలలో ఎటువంటి గణనీయమైన మార్పులు ఉండవని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. వర్షాలు కురిసినప్పటికీ ఉష్ణోగ్రతలు యథాతథంగానే కొనసాగే అవకాశం ఉందని సంచాలకులు ఒక ప్రకటనలో తెలిపారు.














Click it and Unblock the Notifications