పైప్‌లైన్ పేలుడు: చంద్రబాబు సీరియస్, ప్రధాని సాయం
న్యూఢిల్లీ: తూర్పుగోదావరి జిల్లాలోని మామిడికుదురు మండలంలో నగరం గ్రామంలో గ్యాస్ పైప్‌లైన్ పేలడంతో జరిగిన భారీ అగ్నిప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రమాదంపై విచారణ జరిపిస్తామని, అధికారులు నిర్ల్యక్ష్యం వహించినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. తన ఢిల్లీ పర్యటను కుదించుకుని శుక్రవారమే రాజమండ్రికి బయల్దేరుతున్నట్లు తెలిపారు.
ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని చంద్రబాబు అన్నారు. ప్రజల భద్రతే తమకు ముఖ్యమని ఆయన అన్నారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు. ప్రమాదంపై విచారణకు ఆదేశించామని తెలిపారు. కాగా, కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

ప్రమాద ఘటన పట్ల తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేల ఆర్థిక సాయాన్ని అందజేయనున్నట్లు ప్రకటించారు. ఘటనపై స్పందించిన ఏపి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ.. ఘటనపై విచారణ జరిపిస్తామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
శుక్రవారం ఉదయం తూర్పుగోదావరి జిల్లాలోని మామిడికుదురు మండలంలో నగరం గ్రామంలో ఓఎన్‌జీసీ గ్యాస్ కనెక్టింగ్ స్టేషన్ సమీపంలోని గెయిల్ గ్యాస్ పైపులైన్ పేలడంతో మంటల్లో చిక్కుకుని 13 మంది సజీవదహనమయ్యారు. మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. గాయపడ్డ మరో 30 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.












Click it and Unblock the Notifications