అంతు చిక్కని బాలినేని రాజకీయం - డిసైడ్ అయ్యారా..!!
వైసీపీలో ఇంఛార్జ్ ల మార్పు వ్యవహారం కొత్త టర్న్ తీసుకుంటోంది. ప్రకాశం జిల్లాలో మార్పులతో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ మంత్రి బాలినేని పార్టీ నాయకత్వంపైన ఆగ్రహంతో ఉన్నారు. ఒంగోలు ఎంపీ మాగుంటకు సీటు లేదని తేల్చేసారు. ఫలితంగా మాగుంట టీడీపీ వైపు చూస్తున్నారు. మాగుంట సీటు కోసం బాలినేని పట్టుబడుతున్నారు. ఈ సమయంలోనే ఒంగోలు ఎంపీ అభ్యర్దిగా కొత్త పేర తెర మీదకు వచ్చింది.
కీలక నిర్ణయాలు : వైసీపీలో ఇంచార్జ్ ల మార్పు నిర్ణయాలు ఆసక్తి కరంగా మారాయి. ప్రకాశం జిల్లాలో చేయాల్సిన మార్పులకు సంబంధించి సీఎం జగన్ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. ఒంగోలు సిట్టింగ్ ఎంపీ మాగుంటకు సీటు లేదనే సంకేతాలు ఇచ్చారు. ఫలితంగా ఇప్పుడు మాగుంట టీడీపీ వైపు అడుగులు వేస్తున్నట్లు స్పష్టం అవుతోంది. మాగుంట సీటు కోసం బాలినేపి ఒత్తిడి తెస్తున్నారు. బాలినేనికి ఒంగోలు ఎమ్మెల్యేగా ఖరారు చేస్తున్నట్లు పార్టీ సమన్వయకర్త సాయిరెడ్డి స్పష్టత ఇచ్చారు. తాజాగా జిల్లాలో ఎన్నికల సమాయత్తంలో భాగంగా సాయిరెడ్డి నిర్వహించిన సమావేశాలకు బాలినేని దూరంగా ఉన్నారు. బాలినేనికి పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని..ఏ మాత్రం తగ్గదని సాయిరెడ్డి చెప్పుకొచ్చారు.

బాలినేని రూటెటు : బాలినేని మాత్రం పట్టు వీడలేదు. ఇదే సమయంలో ఒంగోలు ఎంపీ అభ్యర్దిగా పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు సిద్దా రాఘవరావు, మద్దిశెట్టి వేణుగోపాల్ పేర్ల పైన ప్రచారం జరిగింది. అనూహ్యంగా చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అక్కడ లోక్‌సభ అభ్యర్థిగా రంగంలో దింపాలని ప్రతిపాదించారు. దీనిని చెవిరెడ్డి కూడా ఆమోదించారు. తాజాగా చెవిరెడ్డి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అభిప్రాయం తెలుసుకునేందుకు, మద్దతు కోరడానికి హుటాహుటిన హైదరాబాద్ వెళ్లారు. ఆయన్ను కలిసి.. తాను ఒంగోలు లోక్‌సభకు పోటీ చేద్దామనుకుంటున్నానని.. ఇద్దరం కలిసి ఎంపీ, అసెంబ్లీ అభ్యర్థులుగా బరిలోకి దిగుదామని చెప్పారు. ఇందుకు ఆయన అంగీకరించలేదు. ఒంగోలు ఎంపీ టికెట్ ప్రస్తుత ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఇస్తేనే తాను మద్దతిస్తానని స్పష్టం చేశారు.

వైసీపీలో ఏం జరుగుతోంది : వైసీపీ తరఫున మాగుంట ఎంపీగా పోటీ చేస్తేనే తాను ఒంగోలు నుంచి అసెంబ్లీకి బరిలోకి దిగుతానని బాలినేని ఇప్పటికే సీఎంకు, ప్రాంతీయ సమన్వయకర్తలకు తేల్చిచెప్పారు. ఇప్పటికే జిల్లాలో మంత్రి ఆదిమూలపు సురేశ్‌ను యర్రగొండపాలెం నుంచి కొండపికి పంపారు. మరో మంత్రి మేరుగ నాగార్జునను వేమూరు నుంచి సంతనూతలపాడుకు మార్పు చేసారు. తాజాగా మాగుంటతో చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం సమావేశమయ్యారు. అయితే, ఆ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని చెబుతున్నారు. ఇక.. మరో ఎమ్మెల్యే మహధీర్ రెడ్డికి సీటు దక్కే అవకాశం కనిపించటం లేదు. తాను సీటు లేకపోతే ప్రశాతం జీవనం గడుపుతానని..రాజకీయ భవిష్యత్ పైన అప్పుడే చెప్పలేనని ఆయన చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications