వైఎస్ జగన్, చంద్రబాబుకన్నా ముందంజలో ఎంపీ రఘురామ!
ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్ రెండు రోజుల క్రితం నియమితులయ్యారు
ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్‌గా నియమితులైన జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ఢిల్లీలో కలిశారు. ఈ విషయాన్ని ఎంపీ ట్విట్టర్ లో తెలిపారు. ఏపీ నూతన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ను కలిసి అభినందనలు తెలిపిన ఎంపీ రఘురామకృష్ణంరాజు అంటూ రాసుకొచ్చారు. గవర్నర్ కు శుభాకాంక్షలు తెలియజేసే ఫొటోను ట్వీట్ చేశారు. వైసీపీ, టీడీపీలకన్నా ముందుగానే ఎంపీ రఘురామ గవర్నర్ ను కలవడం ఆసక్తికరంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్ రెండు రోజుల క్రితం నియమితులయ్యారు. గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. దేశంలో కీలకమైన అయోధ్య, ట్రిపుల్ తలాక్, పెద్దనోట్ల రద్దు లాంటి కీలక కేసుల్లో తీర్పు ఇచ్చిన ధర్మాసనంలో సభ్యుడిగా ఉన్నారు. తన తీర్పులద్వారా ప్రభుత్వానికి ఉపశమనం కలిగించేవారు. జనవరి నాలుగో తేదీన సుప్రీం న్యాయమూర్తిగా నజీర్ పదవీ విరమణ చేశారు. తాజాగా ఏపీ గవర్నర్ గా నియమితులయ్యారు.

త్వరలోనే ఆయన బాధ్యతలు చేపట్టబోతున్నారు. మరోవైపు ఏపీ నూతన గవర్నర్‌గా నియమితులైన రిటైర్డ్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే చత్తీస్‌గఢ్ గవర్నర్‌గా నియమితులైన బిశ్వభూషణ్ హరిచందన్‌కు ముఖ్యమంత్రి జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ ప్రగతి పథంలో పయనించేందుకు గవర్నర్ అందించిన సహకారం మరవలేనిదని సీఎం కొనియాడారు.
ఎంపీ రఘురామకృష్ణంరాజు తన సొంత నియోజకవర్గం నర్సాపురానికి కొంతకాలం నుంచి దూరంగా ఉంటున్నారు. నియోజకవర్గంలో అడుగు పెడితే వివిధ కేసుల పేరుతో తనను అరెస్ట్ చేసే అవకాశం ఉండటంతో ఆయన ఢిల్లీ, హైదరాబాద్ కే పరిమితమవుతున్నారు. ప్రధానమంత్రి భీమవరం పర్యటన సమయంలో కార్యక్రమంలో పాల్గొనేందుకు నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ లో బయలుదేరి బేగంపేట స్టేషన్ లోనే దిగిపోయారు. సత్తెనపల్లి వద్ద తనను హతమార్చేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆరోపించారు.












Click it and Unblock the Notifications