ఎంపీ రామ్మోహన్ కీలక నిర్ణయం - ఎన్నికల వేళ టీడీపీలో అనూహ్య పరిణామాలు..!!
ఎన్నికల వేళ టీడీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ నుంచి గెలిచిన ముగ్గురు ఎంపీలు వరుస షాక్ లు ఇస్తున్నారు. దీంతో కొత్త ఎంపీ అభ్యర్దుల కోసం టీడీపీ అన్వేషణ ప్రారంభించింది. మొత్తం 25 లోక్ సభ స్థానాల్లో బలమైన వారిని బరిలోకి దించాలని భావిస్తోంది. వైసీపీ అటు అభ్యర్దులను ప్రకటిస్తున్న వేళ..ఇటు టీడీపీలో ధీటైన వారెవరని ఆరా తీస్తోంది. అసెంబ్లీకి ఓకే అంటున్న నేతలు ఎంపీ లుగా ముందుకు రాకపోవటం టీడీపీకి సమస్యగా మారుతోంది.
ఎన్నికల లెక్కలు
తెలుగుదేశంలో కొత్త సమస్య మొదలైంది. ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ సమయంలో పార్లమెంట్ బరిలో నిలిచే అభ్యర్దుల ఎంపిక సంకటంగా మారుతోంది. పైకి పార్టీలో దూకుడు కనిపిస్తున్నా.. క్షేత్రస్తాయిలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. టీడీపీకి ఉన్న ముగ్గురు ఎంపీలూ తలోదారిలో ఉన్నారు. ఇప్పటికే విజయవాడ ఎంపీ కేశినేని నాని పార్టీకి, పదవికి రాజీనామా చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇక గుంటూరు ఎంపీగా ఉన్న జయదేవ్ చాలా కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈసారి పోటీ చేయలేనని తేల్చి చెప్పారు. అటు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ఈసారి అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్నారు. సిట్టింగ్ ఎంపీలే ఇలా పోటీకి ఆసక్తి చూపకపోవడంతో మిగతావాళ్లు కూడా పోటీకి ఆసక్తి చూపడం లేదు.

ఎంపీ అభ్యర్దులు కావలెను
ఇక మిగిలిన ఎంపీ నియోజకవర్గాల పరిస్థితి కూడా అలాగే ఉంది. అక్కడ కూడా పోటీ చేసేందుకు నాయకులు ఎవరూ ముందుకు రావడం లేదు. పార్టీ పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటే.. ఎంపీగా పోటీ చేసే వారికి చంద్రబాబు పెడుతున్న టార్గెట్లు కూడా ఎక్కవగా ఉన్నాయని ప్రచారం సాగుతోంది. పోటీకి దూరంగా ఉండానికి ఇదీ ఒక కారణమన్న ప్రచారం ఉంది. రాయలసీమలో తిరుపతి స్థానం నుంచి పోటీలో ఉండే సినీనటుడు శివప్రసాద్ మరణంతో అక్కడ పార్టీకి సరైన అభ్యర్థి ఇప్పటికీ దొరకడం లేదు. చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరు ఎంపీ స్థానానికి కూడా అభ్యర్థి కూడా దొరకని పరిస్థితి ఉంది. కర్నూలు నుంచి గత ఎన్నికల్లో కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి పోటీ చేశారు. కానీ ఈసారి ఆయన ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తిగా లేరని సమాచారం.
సీట్ల ఖరారులో సమస్యలు
టీడీపీకి కీలకమైన విజయవాడలో సీటు ఖరారు పైన చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. గుంటూరు జిల్లాలో వైసీపీ నుంచి వచ్చే నేతల వైపు టీడీపీ ఆశగా చూస్తోంది. నరసరావుపేట నుంచి పోటీ చేసిన రాయపాటి ఏకంగా పార్టీకే దూరంగా ఉంటున్నారు. బాపట్లలో పోటీ చేసిన మాల్యాద్రి శ్రీరామ్ పరిస్థితి కూడా అంతే. కడపలోనూ పోటీ చేసే అభ్యర్థి దొరకడం లేదు. ఇలా 25 నియోజకవర్గాల్లో సగానికిపైగా స్థానాల్లో ఎంపీ అభ్యర్థులు దొరకడం లేదు. చంద్రబాబు సూచించినా పార్టీలో నాయకులు ఎవరూ ఎంపీలుగా పోటీ చేయడానికి ఆసక్తి చూపడం లేదు. దీంతో, ఆర్దికంగా బలంగా ఉన్న నేతలను ఒప్పించి బరిలోకి దింపేలా పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications