
నాది రాయలసీమ, నా మామది అమరావతి, నా బిడ్డనిచ్చింది విశాఖపట్నం : మూడు రాజధానులపై టీజీ వెంకటేశ్
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుపై ఆయా పార్టీలు ఇప్పటికే తమ వైఖరిని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అధికార వైసీపీ తప్ప మిగతా పార్టీలేవి మూడు రాజధానుల నిర్ణయాన్ని సమర్థించడం లేదు. టీడీపీ నేతలు అమరావతి రైతులతో కలిసి ఇప్పటికే ఆందోళనల్లో పాల్గొంటున్నారు. మరోవైపు జనసేన,బీజేపీ కూడా మూడు రాజధానులకు వ్యతిరేకమని ప్రకటించాయి. అయితే బీజేపీలో టీజీ వెంకటేశ్ లాంటి నేతలు మూడు రాజధానుల నిర్ణయాన్ని సమర్థిస్తుండటం గమనార్హం. తాజాగా ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన మూడు రాజధానుల నిర్ణయాన్ని సమర్థిస్తూ మాట్లాడారు.

తడబడ్డ టీజీ..
సోమవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీజీ వెంకటేశ్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పొరపాటున మా తెలుగుదేశం పార్టీ నేతలు అంటూ నాలుక కరచుకున్నారు. దీంతో అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులు.. 'సార్ మీరు బీజేపీ కదా..' అని గుర్తుచేశారు. వెంటనే పొరపాటును సరిదిద్దుకున్న టీజీ వెంకటేశ్.. తెలుగుదేశం కాదు తెలుగు ప్రజలు అంటూ కవర్ చేశారు. సరే,ఇదంతా ఎందుకు.. మళ్లీ మొదటినుంచి చెబుతానంటూ మీడియా సమావేశాన్ని మళ్లీ తొలినుంచి ప్రారంభించారు.

మూడు రాజధానులను సమర్థించిన టీజీ..
రాష్ట్రంలో మూడు రాజధానులు ఉండాలన్న నిర్ణయాన్ని టీజీ వెంకటేశ్ సమర్థించారు. మూడు ప్రాంతాల్లో సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు ఉండటం సరైందేనన్నారు. ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న గ్రామ సచివాలయాల ఏర్పాటు నిర్ణయం డైనమిక్ అంటూ ప్రశంసించారు.'నా మామది అమరావతి, నాది రాయలసీమ,నా బిడ్డనిచ్చింది విశాఖపట్నం' అని.. అందుకే మూడు రాజధానులు ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు.

వ్యతిరేకిస్తోన్న బీజేపీ..
మూడు రాజధానులపై టీజీ వాదన ఇలా ఉంటే.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ,రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ మాత్రం దాన్ని వ్యతిరేకిస్తోన్న సంగతి తెలిసిందే. రాజధానిగా అమరావతినే బీజేపీ పూర్తిగా సమర్థిస్తోందని జీవీఎల్ ఇదివరకే స్పష్టం చేశారు. ఆ పార్టీ రాష్ట్ర ఇంచార్జి సునీల్ దియోధర్ కూడా అమరావతి నుంచి రాజధానిని తరలించడాన్ని వ్యతిరేకించారు. జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.

కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
ఇక మూడు రాజధానుల నిర్ణయంపై ఇప్పటివరకు తమకెలాంటి సమాచారం లేదని ఆదివారం కేంద్ర హోంమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అమరావతి రైతులు,జేఏసీ ఢిల్లీలో కిషన్ రెడ్డిని కలిసి.. రాజధాని విషయంలో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఆయన స్పందించారు. కేంద్రానికి లిఖితపూర్వకంగా సమాచారం అందిన తర్వాతే.. రాజధానిపై ఏపీ ప్రభుత్వంతో మాట్లాడుతామని ఆయన అన్నారు.రాజ్యాంగం పరిధిలోనే కేంద్రం వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. రాజధాని వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమే అయినా.. కేంద్రం నుంచి కొన్ని సూచనలు చేస్తామన్నారు.