విజయసాయిరెడ్డికి ముఖ్య బాధ్యతలు - బాలినేని ఎఫెక్ట్ ,ప్రచారానికి చెక్..!!
వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డికి పార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది. కొంత కాలంగా పార్టీ వ్యవహారాలకు విజయ సాయిరెడ్డి దూరంగా ఉంటున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే పార్టీ సీనియర్ నేత బాలినేని రీజనల్ ఇంఛార్జ్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అనారోగ్య కారణాలతో తన సొంత నియోజకవర్గానికి పరిమితం అవుతానని ప్రకటించారు. ఈ దశలో బాలినేని తో పార్టీ సంప్రదింపులు చేస్తోందని..తిరిగి ఆయన బాధ్యతలు తీసుకుంటారని భావిస్తున్న వేళ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
సాయిరెడ్డికి బాధ్యతలు : వైసీపీ పార్లమెంటరీ నేత విజయ సాయిరెడ్డి మరోసారి ఎన్నికల వేళ ముఖ్య బాధ్యతలు తీసుకుంటున్నారు. ఆయన ప్రస్తుతం పార్టీ అనుబంధ విభాగాల సమన్వయకర్తగా బాధ్యతల్లో కొనసాగుతున్నారు. తాజాగా పార్టీ సీనియర్ నేత బాలినేని వైసీపీకి కంచుకోటలుగా ఉన్న జిల్లాలకు సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలతోనే బాలినేని తాను బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఒంగోలు నియోజకవర్గానికి పరిమితం అవుతానని చెప్పారు. తనకు వ్యతిరేకంగా పార్టీలో ముఖ్యులే కుట్ర చేస్తున్నారంటూ ఆరోపణలు చేసారు. దీంతో, ప్రకాశం జిల్లాలో పరిణామాల పైన సీఎం ప్రత్యేకంగా ఫోకస్ చేసారు.

కీలక నిర్ణయం దిశగా సీఎం : ఈ సమయంలోనే ముఖ్యమంత్రి మరో నిర్ణయం తీసుకున్నారని సమాచారం. బాలినేని స్థానంలో విజయసాయిరెడ్డి నెల్లూరు, ప్రకాశం,తిరుపతి జిల్లాల సమన్వయకర్తగా బాధ్యలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారికంగా నిర్ణయం వెలువడాల్సి ఉంది. ఈ మూడు జిల్లాలు తొలి నుంచి వైసీపీకి కంచుకోటలుగా ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో ఈ మధ్య కాలంలో మగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీకి వ్యతిరే కంగా మారారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారనే కారణంతో ఆ ముగ్గురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేసారు. నెల్లూరు విజయ సాయిరెడ్డి సొంత జిల్లా. ఈ మూడు జిల్లాలపైన సాయిరరెడ్డికి పూర్తి స్థాయిలో అవగాహన..పట్టు ఉంది. దీంతో, ఇప్పుడు సాయిరెడ్డికి బాధ్యతలు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు.
నెల్లూరు పై ప్రత్యేకంగా : కొంత కాలంగా సాయిరెడ్డికి పార్టీలో ప్రాధాన్యత తగ్గిందనే ప్రచారం ఉంది. దీని కారణంగానే ఆయన పార్టీ వ్యవహారాల్లో క్రియాశీలకంగా లేరనే ప్రచారం కొనసాగుతోంది. ఈ సమయంలోనే కీలకమైన మూడు జిల్లాల బాధ్యతలను సాయిరెడ్డికి అప్పగించటం ద్వారా ఈ ప్రచారానికి చెక్ పెట్టినట్లుగా భావిస్తున్నారు. ఇదే సమయంలో ప్రకాశం జిల్లాలో బాలినేనికి ప్రాధాన్యత కొనసాగించే ఆలోచన జరుగుతోంది. మిగిలిన రెండు జిల్లాలతో పాటుగా అనుబంధ సంఘాల బాధ్యతలను సాయిరెడ్డి పర్యవేక్షిస్తారని చెబుతున్నారు. ముందుగా నెల్లూరు జిల్లాలో పార్టీ పరిస్థితుల పైన ఆయన ఫోకస్ పెడతారని చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారం పైన ఒకటి రెండు రోజుల్లోనే స్పష్టత రానుంది.












Click it and Unblock the Notifications