మాన్సాస్ భూములపై ఎంపీ సాయిరెడ్డి సంచలనం.. దొంగ జీవోలు తెచ్చి భూములు అమ్మారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాన్సాస్, సింహాచలం ట్రస్ట్ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ కాగా, అయినప్పటికీ వైసీపీ నేతలు దేవాదాయ భూముల పరిరక్షణ, మాన్సాస్ ట్రస్ట్ భూముల పరిరక్షణ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్తున్నారు.

దేవాదాయ భూముల పరిరక్షణ, ఆలయాల అభివృద్ధి సమీక్షా సమావేశంలో పాల్గొన్న సాయిరెడ్డి
దేవాదాయ భూముల పరిరక్షణ, ఆలయాల అభివృద్ధికి ఈరోజు విశాఖపట్నంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న విజయసాయిరెడ్డి దేవాదాయ భూములు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక ఎకరం కూడా ఆక్రమణకు గురి కాకూడదు అని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా పంచ గ్రామాల సమస్యలు పరిష్కరిస్తామని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయి రెడ్డి హామీ ఇచ్చారు. సింహాచలం భూముల రక్షణ కోసం ప్రహరీ గోడ నిర్మిస్తామని ఆయన పేర్కొన్నారు.

గత పదేళ్లుగా ,మాన్సాస్ ట్రస్ట్ విద్యా సంస్థల్లో ఆడిటింగ్ జరగలేదు
సీఎం జగన్ మోహన్ రెడ్డి దేవాదాయ భూములు ఆక్రమణకు గురికాకుండా కాపాడాలని ఆదేశించారని, అందుకు అనుగుణంగా ముందుకు సాగుతామని పేర్కొన్న విజయసాయిరెడ్డి మాన్సాస్ ట్రస్టు భూముల వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మాన్సాస్ ట్రస్ట్ లో పద్నాలుగు వేల ఎకరాల భూమి ఉందని, ఆ భూమిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన పేర్కొన్నారు. మాన్సాస్ ట్రస్ట్ లో 14 విద్యాసంస్థలు కూడా ఉన్నాయని, గత పదేళ్లుగా విద్యాసంస్థల్లో ఆడిటింగ్ కూడా జరగలేదు అంటూ వ్యాఖ్యానించారు.
Recommended Video

టీడీపీ హయాంలో దొంగ జీవోలు.. అవకతవకలు
ఇప్పుడు ఆడిటింగ్ నిర్వహిస్తామని ఒకవేళ ఆడిటింగ్ లో అవకతవకలు ఉన్నట్టు తేలితే చర్యలు తప్పవు అంటూ విజయసాయి రెడ్డి హెచ్చరించారు.గతంలో టిడిపి హయాంలో దొంగ జీవోలు తీసుకువచ్చి, నిబంధనలను పాటించకుండా ట్రస్ట్ భూములను అమ్మారని గత టిడిపి ప్రభుత్వ తీరును విజయసాయిరెడ్డి విమర్శించారు. ట్రస్ట్ భూములను అమ్మాలంటే కోర్టు అనుమతి ఉండాలని, కానీ ఆ నిబంధనలేవీ పాటించలేదని విమర్శించారు.భూ ఆక్రమణలకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications