పులివెందుల, కుప్పంలల్లో ఓ చిన్న పోల్ ఫైట్- ఎవరు నెగ్గుతారో గానీ
రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉంటూ వస్తోన్న మండల పరిషత్, జిల్లా పరిషత్, పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు మొదలు పెట్టింది. దీనికి సంబంధించి వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ అయ్యాయి కూడా. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎస్ఈసీ నీలం సాహ్నీ ఈ మేరకు వీటిని విడుదల చేశారు. ఆగస్టు 10వ తేదీన పోలింగ్ జరుగుతుంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న కుప్పం, పులివెందుల నియోజకవర్గాలు కూడా ఇందులో ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. అందరి దృష్టినీ ఆకట్టుకుంటోంది. వీటి ఫలితాలు ఎలా ఉంటాయనేది చర్చనీయాంశమౌతోంది.

జెడ్పీటీసీ స్థానాల్లో పులివెందుల, ఒంటిమిట్ట ఉన్నాయి. ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించాల్సిన జాబితాలో చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలం మణీంద్రం, పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని కారంపూడి మండలం వేపకంపల్లి, నెల్లూరు జిల్లా కావలి మండలం విడవలూరు-1 ఎంపీటీసీలు ఉన్నాయి.
ప్రకాశం జిల్లా కొండెపి సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నిక, తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక సర్పంచ్ స్థానానికి ఎన్నికల నిర్వహించడానికి ఎస్ఈసీ నోటీఫికేషన్ జారీ చేశారు. దీని ప్రకారం చూసుకుంటే.. ఈ నెల 30వ తేదీలోగా రిటర్నింగ్ అధికారి ఎన్నికల నోటీసు జారీ చేయాల్సి ఉంటుంది. ఓటర్ల జాబితాను ప్రదర్శించాలి.
30 నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 2న నామినేషన్లు స్క్రూటినీ చేస్తారు. తిరస్కరించిన నామినేషన్లపై అప్పీల్ చేసుకోవడానికి 3వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. వాటన్నింటినీ కూడా అప్పిలేట్ అథారిటీ 4వ నాటికి పరిష్కరించాల్సి ఉంటుంది.
నామినేషన్ల ఉపసంహరణకు 5వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉంటుంది. అదేరోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత అభ్యర్థుల తుది జాబితా ఆయా జిల్లాల రిటర్నింగ్ అధికారులు అధికారికంగా విడుదల చేస్తారు. 10న పోలింగ్ ఉంటుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు.
అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెలువడుతాయి. రీపోలింగ్ గనక అవసరమైతే వాటిని 12వ తేదీన నిర్వహిస్తారు. ఎన్నికలు జరిగే ఆయా రెవెన్యూ డివిజన్లు (జెడ్పీటీసీ), మండలాల (ఎంపీటీసీ) పరిధుల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.












Click it and Unblock the Notifications