ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డిని విద్యాశాఖ మంత్రిని చెయ్యాలి: బీజేపీ షాకింగ్ డిమాండ్!
తెలంగాణా రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో వైఫల్యాలు సీఎం రేవంత్ రెడ్డి వల్లనే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాం చంద్ర రావు పేర్కొన్నారు. విద్యాశాఖను యువ నాయకుడికి అప్పగిస్తామని చెప్పిన కాంగ్రెస్ ఆ మాటను కూడా నిలబెట్టుకోలేదని, విద్యాశాఖలో పూర్తిగా విఫలమైన సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా నైతిక బాధ్యత వహించి తక్షణమే రాజీనామా చేయాలని రాంచందర్ రావు డిమాండ్ చేశారు.
ఎన్నికల్లో పోటీ చేసే వయస్సుపై కాంగ్రెస్ ప్రతిపాదన అందుకే : బీజేపీ
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, నెరవేర్చని హామీల నుంచి జెన్-జీ యువత దృష్టిని మళ్లించడానికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయస్సును 25 నుండి 21 ఏళ్లకు తగ్గించాలనే కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు విమర్శించారు. రాజ్యాంగ నిర్మాతలు, ముఖ్యంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ శాసనసభ్యుడికి అనుభవం అవసరమనే దూరదృష్టితోనే 25 ఏళ్ల వయస్సును నిర్ణయించారన్నారు.

యువతపై చిత్తశుద్ధి ఉంటే ముందు ఈ పని చెయ్యండని సవాల్
ఇప్పుడు సీఎం చేస్తున్నది కేవలం డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ రోజు బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ పార్టీకి నిజంగా యువతకు అవకాశాలు ఇవ్వాలనే చిత్తశుద్ధి ఉంటే, ముందుగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవి నుండి మల్లికార్జున్ ఖర్గే గారిని తప్పించి, ఆ బాధ్యతలను ఎవరైనా యువ నాయకుడికి అప్పగించాలని సవాల్ విసిరారు.
యువతకు ఇచ్చిన హామీల మాటేంటి?
తమ బీజేపీ ఇప్పటికే నితిన్ నబిన్ గారిని జాతీయ అధ్యక్షుడిగా నియమించి యువతకు తగిన ప్రాధాన్యం ఇచ్చిందని గుర్తుచేశారు. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా విద్యార్థులు, యువతకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. రాష్ట్రంలో సుమారు 20లక్షల మంది విద్యార్థులకు చెల్లించాల్సిన రూ.12,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయలేదన్నారు. విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన గుర్తచేశారు.
యూనివర్సిటీలకు ఇచ్చిన హామీల మాటేంటి?
అదేవిధంగా తెలంగాణలోని 17 ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు నిధుల కొరత, అధ్యాపకుల కొరతతో తీవ్ర సంక్షోభంలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యూనివర్సిటీలకు రూ.1,000 కోట్లు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటివరకు రూపాయి కూడా విడుదల చేయలేదు. ఉపాధ్యాయులకు జీతాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేక విద్యా వ్యవస్థ కుదేలైందని రాంచందర్ రావు మండిపడ్డారు.
కాంగ్రెస్ యువ ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డిని మంత్రిని చెయ్యండి
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ.. యువతకు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, నెలకు రూ.4,000 నిరుద్యోగ భృతి, విద్యాభరోసా కార్డులు, విద్యార్థినులకు ఉచిత స్కూటర్లు, ప్రైవేట్ ఉద్యోగాల్లో 75% స్థానికులకు రిజర్వేషన్లు, యూత్ కమిషన్, ఎంప్లాయిమెంట్ సపోర్ట్ సిస్టమ్ వంటి ప్రతి హామీ గాలిలో కలిసిపోయిందని విమర్శించారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే విద్యాశాఖ బాధ్యతలను కాంగ్రెస్ యువ ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డికి అప్పగించి నిరూపించుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications