మా సత్తా ఏంటో చూపిస్తాం: చంద్రబాబుకు ముద్రగడ హెచ్చరిక
ఖమ్మం: మాజీ మంత్రి, కాపు రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న ముద్రగడ పద్మనాభం మరోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబునాయుడుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు చీటింగ్ చేస్తే కాపు సత్తా చూపిస్తామని ముద్రగడ పద్మనాభం హెచ్చరించారు.
ఖమ్మంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు సీఎం కుర్చీలో కూర్చోవడం కోసం తమ జాతిని నమ్మించి ఓట్లు వేయించుకున్నాడని ఆరోపించారు.
కాపు రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఆగస్టు నెలాఖరు వరకు గడువిస్తున్నామని ముద్రగడ చెప్పారు. ఈ నెలాఖరులోగా ప్రభుత్వం రిజర్వేషన్లపై ప్రకటన చేయకుంటే వచ్చే నెల నుంచి తమ కార్యాచరణను ప్రారంభిస్తామన్నారు.

పవన్ కల్యాణ్ ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నాడని, తాను కులం కోసం పోరాటం చేస్తున్నానని ఆయన అన్నారు. సెప్టెంబర్ 11న రాజమండ్రిలో 13 జిల్లాల నాయకులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ముద్రగడ చెప్పారు.
కాగా, శనివారం విశాఖ పర్యటనలో ఉన్న కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పవన్ సభపై స్పందిస్తూ.. 'పవన్ కల్యాణ్ తో పోలిస్తే తాను అల్పుడినని, అతని స్థాయికి తగనని, నేటి తిరుపతి సభ గురించి మాట్లాడే స్థాయి తనకు లేదని' వ్యాఖ్యానించడం గమనార్హం.












Click it and Unblock the Notifications