చంద్రబాబుపై గురి: తునిలో ముద్రగడ కాపు గర్జన సందడి
కాకినాడ: మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తూర్పు గోదావరి జిల్లా తునిలో ఆదివారం తలపెట్టిన కాపు ఐక్య గర్జనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపైకి ఈ సభను గురిపెట్టినట్లు స్పష్టంగానే అర్థమవుతోంది. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలనేది వారి ప్రధాన డిమాండ్. అయితే, కాపుల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై కూడా కాపు నేతలు ఓ చిట్టా ఇచ్చారు.
ముద్రగడ పద్మనాభం కాపు ఐక్య గర్జనకు రాజకీయాలతో సంబంధం లేదని చెబుతున్నారు. కానీ, దాని వెనక వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారనేది స్పష్టంగానే తెలిసిపోతోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోని కాపు నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు ఈ సభ విషయంలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు.
తెలుగు దేశం గత ఎన్నికల్లో 600 హామీలను ఇచ్చింది. ఈ హామీల్లో ఓసీలుగా ఉన్న కాపులను బీసీలుగా గుర్తిస్తామనేది కూడా ఒకటి. ఈ హామీ నెరవేర్చక పోవడంతో జనవరి 31, 2016న ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో ఛలో తుని కాపు మహాసభను తలపెట్టారు.

ఇదే సమయంలో విజయవాడ విలేకర్ల సమావేశంలో పుట్టుస్వామి కమీషన్‌ను పునరుద్దరిస్తే సరిపోతుంది కదా అని కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి కొత్తవాదానికి తెరలేపారు. అంతేకాదు రానున్న 2019 ఎన్నికలలో మా రాహుల్ గాంధీ ప్రధాని అయితే కాపులను బీసీలుగా గుర్తిస్తామని తెలుగుదేశం పార్టీని విమర్శనాత్మకంగా చులకన చేసి మాట్లాడారు.
ముద్రగడ పద్మనాభం కాపు ఐక్య గర్జనకు సమాధానంగా కాపులకు రిజర్వేషన్లు కల్పించే విషయంపై అధ్యయానికి మంజునాథ్ కమిషన్ ఏర్పాటు చేశామని చంద్రబాబు చెబుతున్నారు. సాధ్యమైనంత త్వరగా నివేదిక తెప్పించి, రిజర్వేషన్లు కల్పిస్తామని కూడా చెబుతున్నారు కానీ ఆ వాదనతో ముద్రగడ పద్మనాభం ఏకీభవించడం లేదు.
కాపు కార్పోరేషన్ ఫిబ్రవరి 26వ తారీఖు వరకు నెట్‌లో ఆన్‌లైన్ ధరఖాస్తు చేసు కోవచ్చనే సమాచారం వినిపిస్తోంది. ఎయిడ్గ్స బాధితులకు వయోపరిమితి కూడా ఇచ్చింది. తద్వారా ముద్రగడ పద్మనాభం తుని సభను కౌంటర్ చేయాలని చంద్రబాబు ప్రభుత్వం భావించింది. ఏమైనా, తుని సభ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ముఖచిత్రాన్ని మారుస్తాయా, లేదా వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications