వైజాగ్ సదస్సు: జగన్ సర్కార్ పై వ్యాపార దిగ్గజాల ప్రశంసలు-అంబానీ, జిందాల్, జీఎంఆర్ ఏమన్నారంటే..
ఏపీలో వైసీపీ సర్కార్ అనుసరిస్తున్న విధానాలు, రాష్ట్రంలో వ్యాపార అనుకూల వాతావరణంపై వ్యాపార దిగ్గజాలు అంబానీ, జిందాల్, జీఎంఆర్ ప్రశంసలు కురిపించారు.
ఏపీలో వైసీపీ సర్కార్ విశాఖలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ తొలిరోజు పలువురు వ్యాపార దిగ్గజాలు హాజరయ్యారు. ఇందులో రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ, జిందాల్ స్టీల్ అధినేత నవీన్ జిందాల్, జీఎంఆర్ అధినేత గ్రంథి మల్లిఖార్జునరావుతో పాటు పలువురు ఉన్నారు. వీరు సదస్సులో భాగంగా తొలిరోజు కీలక ప్రసంగాలు చేశారు. ఇందులో ఏపీలో వ్యాపార అనుకూల వాతావరణాన్ని ప్రశంసించారు.
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో పాల్గొనడం తమకు గౌరవమని, ఇది వేంకటేశ్వర స్వామి వారి పుణ్యభూమి అని జిందాల్ స్టీల్ అధినేత నవీన్ జిందాల్ తెలిపారు. ఏపీలో పనిచేసిన వ్యక్తిగత అనుభవాన్ని ఆయన పంచుకున్నారు. ఏపీ ఇన్‌ఫ్రా బేస్, వ్యాపార అనుకూల వాతావరణానికి ప్రసిద్ధి చెందిందని జిందాల్ వెల్లడించారు. జిందాల్ గ్రూప్ తరపున ప్రోగ్రెసివ్ పాలసీ, పెట్టుబడిదారులకు అనుకూలమైన స్థలాన్ని సృష్టించే సింగిల్ విండో పాలసీకి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఆరునెలల్లో 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించి అందిస్తామని హామీ ఇచ్చారు.

ఏపీ సమృద్ధిగా వనరులు, మౌలిక వసతులతో వ్యూహాత్మకంగా అభివృద్ధి చెందుతోందన్నారు. పెట్టుబడిదారులుగా తాము ఏపీ వాస్తవ పరిస్ధితులపై ఆధారపడతామన్నారు. దేశంలోనే అత్యధిక జీఎస్‌డీపీ వృద్ధిని ఏపీ సాధించిందని, గత నెలలో స్టీల్ ప్లాంట్‌కు భూమి పూజ చేశారని గుర్తుచేశారు. జీఎస్ డబ్ల్యూ నుంచి తన సోదరుడు ఆర్ట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీని ఏర్పాటు చేయబోతున్నాడని జిందాల్ తెలిపారు. ఏపీలో తాము నిర్మించిన ప్రాజెక్టులు నాణ్యతకు మచ్చుతునక అన్నారు. ఏపీ యాత్రలో భాగమైనందుకు గౌరవంగా భావిస్తున్నామని, ఇందుకు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు.

అనంతరం మాట్లాడిన జీఎంఆర్ అధినేత గ్రంధి మల్లిఖార్జునరావు.. తన స్వరాష్ట్రం విశాఖపట్నంలోని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌ను అభివృద్ధి చేయడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ విమానాశ్రయం మొదటి దశలో ఆరు మిలియన్ల ప్రయాణీకులకు, అంతిమంగా 30 మిలియన్ల ప్రయాణీకులకు సేవలు అందిస్తుందన్నారు.

మొదటి దశలో రూ. 5000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపారు. తాము విమానాశ్రయం చుట్టూ మెట్రోపాలిస్, విమానాశ్రయ నగరాలను కూడా అభివృద్ధి చేస్తామన్నారు.ఇందులో పారిశ్రామిక జోన్, ఎయిర్‌స్పేస్ జోన్, విద్య, ఆరోగ్య సంరక్షణ జోన్‌లు ఉంటాయన్నారు. హైదరాబాద్ విమానాశ్రయం విజయాన్ని భోగాపురంలో పునరావృతం చేస్తామన్నారు. ఇది వైజాగ్ నగరం అభివృద్ధికి తోడ్పడుతుందని, రాష్ట్రాన్ని అత్యంత ప్రాధాన్య పెట్టుబడి గమ్యస్థానంగా ప్రపంచ పటంలో ఉంచుతుందన్నారు.

అనంతరం రిలయన్స్ గ్రూప్ అధినేత ముకేష్ అంబానీ కూడా రాష్ట్రంలో తమ పెట్టుబడి ప్రణాళికల్ని వివరించారు. రాష్ట్రంలో మొత్తం రూ.40 వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు అంబానీ తెలిపారు. తద్వారా రాష్ట్రంలో అతిపెద్ద, అత్యుత్తమ డిజిటల్ నెట్‌వర్క్ ను సృష్టిస్తున్నామన్నారు. మా 4G నెట్‌వర్క్ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతంలో నివసించే వారితో సహా 98 శాతం ఏపీ జనాభాను కవర్ చేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో సహా భారతదేశం అంతటా 2023 చివరిలోపు నిజమైన 5g పూర్తవుతుందన్నారు.












Click it and Unblock the Notifications