రూ.5 నాణెం కోసం బావను ముక్కలు ముక్కలుగా నరికి చంపిన బావమరిది
అమరావతి: ఐదు రూపాయల నాణెం కోసం జరిగిన గొడవలో బావను బావమరిది హతమార్చిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ సంఘటన విశాఖపట్నంలోని పాడేరు మండలంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు వెల్లడించిన కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
మండలంలోని లగిశపల్లి పంచాయతీ ఉగ్గంగొయ్యికి చెందిన కిల్లో కామేశ్వరరావు, హుకుంపేట మండలం కొట్నాపల్లి పంచాయతీ సువ్వపాడునికి చెందిన సీదరి నూకరాజు వరసకు బావ, బావమరుదులు అవుతారు. విశాఖ మన్యంలో నాణాల వ్యాపారులు పాత ఐదు రూపాయల నాణంకు అధిక మొత్తంలో నగదు చెల్లిస్తుంటారు.
ఈ విషయం తెలుసుకున్న కామేశ్వరరావు బావ నూకరాజుకు ఏడాది క్రితం ఇచ్చిన ఓ ఐదు రూపాయి నాణాన్ని తిరిగి ఇవ్వమని అడిగాడు. ఈ క్రమంలో నూకరాజు దానిని ఇవ్వకపోవడంతో నూకరాజుపై కామేశ్వరరావు ఆగ్రహంతో ఉన్నాడు. ఈ నేపథ్యంలో నెల రోజుల క్రితం సువ్వపాడు నుంచి నూకరాజు ఉగ్గంగొయ్యికి వచ్చాడు.

ఆ సమయంలో బావ, బావమరుదులు ఇద్దరూ మద్యం సేవించి నాణెం కోసం గొడవ పడ్డారు. డబ్బులు ఇవ్వలేదన్న ఆగ్రహంతో ఉన్న కామేశ్వరరావు ఉగ్గంగొయ్యి-వజంగి గ్రామాల మధ్య కొండల్లోకి నూకరాజును తీసుకువెళ్లి కత్తితో ముక్కలు, ముక్కలుగా నరికి హతమార్చాడు.
అనంతరం తనకు ఏమీ తెలియనట్టు గ్రామానికి వచ్చి తన పని తాను చేసుకుంటున్నాడు. అయితే నెల రోజులైనా నూకరాజు ఆచూకీ తెలికపోవడంతో కామేశ్వరరావు భార్య తన అన్నయ్య ఏమిచేశావని ఆదివారం నిలదీసింది. దీంతో నూకరాజుని హతమార్చిన చోటుకి కుటుంబ సభ్యులను తీసుకెళ్లాడు.
ఆ తర్వాత అక్కడ నుంచి పరారయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న నూకరాజు సోదరుడు ఆదివారం సాయంత్రం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని బయటకు తీసేందుకు ఎస్‌ఐ ఎస్.సూర్యప్రకాశరావు నేతృత్వంలోని బృందం సంఘటనా స్థలానికి వెళ్లింది.
అయితే వాతావరణం అనుకూలించకపోవడం, వర్షం పడటంతో కొండపైకి వెళ్లలేక ఆదివారం సాయంత్రం పోలీసులు వెనుదిరిగారు. సోమవారం సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications