బీజేపీ, టీడీపీలు కుట్రపన్నాయి: మైసూరా, మీ అబద్ధాలు రేపు బయటపడతాయి: పద్మ
హైదరాబాద్: కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిదంటూ ఆందోళనలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు రావాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మైసూరా రెడ్డి డిమాండ్ చేశారు. కడప జిల్లాలో నిరవధిక నిరాహారదీక్ష చేపట్టిన కమలాపురం ఎమ్మెల్యే పోచంరెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిన మాట వాస్తవమేనని, అయితే అందులో తెలుగుదేశం పార్టీకి కూడా భాగస్వామ్యం ఉందన్నారు. కేంద్ర బడ్జెట్‌లో పోలవరానికి కేవలం రూ. 100 కోట్లు కేటాయించడంపై అనుమానాలున్నాయని అన్నారు.
రెక్కలు విరిచారంటున్న చంద్రబాబు... కేంద్ర కేబినెట్‌లో తమ పార్టీని ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టును నీరు గార్చి, పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేయాలని బీజేపీ, టీడీపీలు కుట్రపన్నాయని ఆయన మండిపడ్డారు.

రాయలసీమకు నీరు తరలించుకుపోతున్నారని గతంలో దేవినేని ఆందోళన చేశారని, ఇప్పుడు గండికోటకు జూలైలోగా నీరందిస్తామంటే ఎలా నమ్మాలని ఆయన ప్రశ్నించారు. సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే శ్రీశైలం నీటిని ఎందుకు వృధాగా కిందికి వదిలారో చెప్పాలన్నారు.
ఏపీ రాజధాని ప్రాంతాల్లో టీడీపీ నేతలు స్వచ్ఛందంగా భూములు ఎందుకు ఇవ్వలేదంటూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. ఏపీ రాజధాని నిర్మాణానికి రాజధాని ప్రాంత రైతుల నుంచి వ్యతిరేకత ఏర్పడిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకిచ్చే పరిహారం కింద టీడీపీ నేతలెవరైనాసరే వాళ్ల భూములిస్తారా? అని ప్రశ్నించారు.
సోమవారం ఆమె పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ల్యాండ్ పూలింగ్ సక్రమంగా జరిగిందని మంత్రి నారాయణ చేసిన వ్యాఖ్యలు పచ్చి అబద్ధమన్నారు. మీ అబద్ధాలన్నీ మంగళవారం బట్టబయలవుతాయని వాసిరెడ్డి పద్మ తెలిపారు. మంగళవారం నాడు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మంగళవారం రాజధాని గ్రామాల్లో పర్యటిస్తారని ఆమె చెప్పారు.
రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని తెలుసుకుని అసెంబ్లీలో ప్రస్తావించేందుకే వైఎస్ జగన్ పర్యటించనున్నట్టు తెలిపారు. బ్రేక్ ఇన్ ఏపీ, మేక్ ఇన్ సింగపూర్ చందంగా ఏపీ ప్రభుత్వం పాలన నిర్వహిస్తోందన్నారు. రాజధాని డిజైన్ కూడా సొంతంగా తయారు చేసుకోలేని దుస్థితా మనది? అంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వానికి సింగపూర్‌కు మధ్య జరిగిన రహస్య ఒప్పందాలు ఏమిటి? అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు.












Click it and Unblock the Notifications