నా ఫోన్ కూడా ట్యాప్ లో ఉందనుకుంటున్నా ? ఏపీలో మరో ఎమ్మెల్సీ అనుమానం !
ఏపీలో అధికార, విపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారంటూ వస్తున్న ఆరోపణల నేపథ్యంలో తాజాగా పీడీఎఫ్ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం కూడా ఇదే అనుమానం వ్యక్తం చేశారు.
ఏపీలో వైసీపీ సర్కార్ అధికార పార్టీతో పాటు విపక్ష నేతలు, అధికారులు, మీడియా ఫోన్లు కూడా ట్యాప్ చేస్తుందన్న ఆరోపణలు కొంతకాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఫోన్ ట్యాపింగ్ ను నిరూపించే అవకాశం లేకపోవడంతో వారంతా మౌనంగా ఉండిపోవాల్సిన పరిస్దితి. అయితే ఆరోపణల పరంపర మాత్రం ఆగడం లేదు.
ఓవైపు నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయంటూ తాజాగా ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. దీంతో అవి ఫోన్ ట్యాపింగ్ కు కావని రికార్డింగ్స్ మాత్రమేనని వైసీపీ వివరణ ఇచ్చింది. అయితే ప్రభుత్వం నుంచి మాత్రం అధికారికంగా వివరణ మాత్రం రాలేదు. ఈ నేపథ్యంలో శాసనమండలిలో విపక్ష పీడీఎఫ్ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం కూడా ట్యాపింగ్ అనుమానాలు వ్యక్తం చేశారు. తన ఫోన్ కూడా నిఘానే ఉన్నట్లుందని ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

ఏపీలో ప్రస్తుతం వివాదాస్పదంగా మారిన కోటంరెడ్డి వ్యవహారంపై స్పందించిన పీడీఎఫ్ సీనియర్ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం తన ఫోన్ కూడా నిఘాలోనే ఉందనుకుంటున్నా అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తాజా పరిస్ధితుల నేపథ్యంలో తాను అలా భావించాల్సి వస్తోందన్నారు. అలాగే రాష్ట్రంలో పరిణామాలు చూస్తుంటే ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం కూడా లేకపోలేదని బాలసుబ్రమణ్యం వ్యాఖ్యానించారు. తద్వారా ఫోన్ల ట్యాపింగ్ వంటి చర్యలు ఎన్నికల ముందు జరిగే ఘటనలే అన్నట్లుగా ఆయన వ్యాఖ్యలున్నాయి.












Click it and Unblock the Notifications