మా సర్వేలో మేమే!:లగడపాటి సర్వేపై మైసురా ఆగ్రహం
హైదరాబాద్: విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ సర్వే పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత మైసూరా రెడ్డి బుధవారం తీవ్రంగా మండిపడ్డారు. రాజకీయ సన్యాసం తీసుకున్నాక ఇక ఆయనకు సర్వేలు ఎందుకని ప్రశ్నించారు. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలకు అనుకూలంగా లగడపాటి సర్వే ఉందని ఆరోపించారు.
తమ అంతర్గత సర్వేలో తమదే అధికారమని తేలిందన్నారు. తమ పార్టీకి 20 నుండి 25 లోకసభ సీట్లు వస్తాయని చెప్పారు. అలాగే 110 నుండి 120 లోకసభ స్థానాలను గెలుచుకుంటామని తమ సర్వేలో తేలిందన్నారు. సీమాంధ్రలో తమ పార్టీయే అధికారంలోకి వస్తుందని మైసూరా ధీమా వ్యక్తం చేశారు.

లగడపాటి ఏ సర్వే చేశాడో తమకు తెలియదన్నారు. అలాగే ఆయన ఎప్పుడు సర్వే చేశారో కూడా తెలియదని ఎద్దేవా చేశారు. ఆయన సర్వే విధానంలోనే లోపం ఉందన్నారు. ఒకరికి వత్తాసు పలికేలా సర్వే ఉండటం సరికాదన్నారు. బెట్టింగులు కట్టే వాళ్లను తప్పుదోవ పట్టించేందుకు లగడపాటి సర్వే అన్నారు.
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లో తమ పార్టీకి, టిడిపికి 2.9 శాతం మాత్రమే ఓట్ల తేడా కనిపించిందన్నారు. పరిషత్ ఫలితాల మార్పు తమకే అనుకూలమని చెప్పారు. చాలా జిల్లాల్లో టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మధ్య ఒక్క శాతం మాత్రమే తేడా ఉందన్నారు. ఇవి సాధారణ ఎన్నికల్లో రివర్స్ అవుతాయన్నారు. తమకు సీట్లు తగ్గుతాయనే భయం లేదన్నారు.












Click it and Unblock the Notifications