ఏపీలో పలు రైళ్లు రద్దు
తమిళనాడులో భాగమతి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురి కావడం ఏపీ- తెలంగాణల్లో పలు రైళ్ల రద్దుకు దారి తీసింది. అనేక రైళ్లను దారి మళ్లించాల్సి వచ్చింది. ఈ ఘటన వల్ల చెన్నై- గూడూరు సెక్షన్ మధ్య దెబ్బతినడం వల్ల దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. పట్టల పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. ఈ తెల్లవారు జాము నాటికి 90 శాతం పూర్తయినట్లు వెల్లడించారు.
మైసూరు- దర్భంగా మధ్య నడిచే సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఇది. చెన్నై డివిజన్ పరిధిలోని కావరపేట్టై రైల్వే స్టేషన్‌లో శుక్రవారం రాత్రి 8:30 గంటల సమయంలో ప్రమాదానికి గురైంది. గూడ్స్ రైలును ఢీ కొట్టింది. ఈ ఘటనలో 12 బోగీలు పట్టాలు తప్పాయి. 19 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారందరిని చెన్నైలోని స్టాన్లీ మెడికల్ కాలేజీకి తరలించారు. అత్యవసర చికిత్సను అందించారు. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ పరామర్శించారు.

ఈ ఘటన వల్ల కావరపేట్టై- తిరువల్లూర్ స్టేషన్ మధ్య పట్టాలు దెబ్బతిన్నాయి. దీనితో చెన్నై- గూడూరు సెక్షన్ మధ్య రైళ్ల రాకపోకలు స్తంభించిపోయాయి. ఈ మార్గంలో రాకపోకలను సాగించే పలు ఎక్స్‌ప్రెస్‌లను దక్షిణ మధ్య రైల్వే అధికారులు రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు.
విజయవాడ- ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ రద్దయింది. కన్యాకుమారి- నిజాముద్దీన్, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్- లక్నో, చెన్నై సెంట్రల్- నిజాముద్దీన్, హైదరాబాద్- చెన్నై సెంట్రల్, న్యూఢిల్లీ- చెన్నై సెంట్రల్, లక్నో- చెన్నై సెంట్రల్, హైదరాబాద్- తాంబరం, విశాఖపట్నం- చెన్నై సెంట్రల్, భువనేశ్వర్- రామేశ్వరం, సంత్రాగచ్చి- చెన్నై సెంట్రల్, భగత్ కీ కోఠీ- మన్నార్‌గుడి, దానాపూర్- బెంగళూరు రైళ్లను అధికారులు దారి మళ్లించారు.

పాట్నా- బెంగళూరు, టాటానగర్- ఎర్నాకుళం, హౌరా- చెన్నై సెంట్రల్, అహ్మదాబాద్- చెన్నై సెంట్రల్, పాట్నా- ఎర్నాకుళం, న్యూఢిల్లీ- చెన్నై ఎగ్మూర్, కాకినాడ పోర్ట్- చెంగల్పట్టు, బెంగళూరు- గువాహటి, బెంగళూరు- కామాఖ్య, బెంగళూరు- దానాపూర్ రైళ్లను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నడిపించారు. గూడూరు- 08624 250795, ఒంగోలు- 08592 280306, విజయవాడ- 0866 2571244, నెల్లూరు- 0861 2345863, ఏలూరు- 7569305268, తాడేపల్లిగూడెం- 8818226162 స్టేషన్లల్లో హెల్ప్ లైన్ సెంటర్లను ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications