TDPతో పొత్తుకు ద్వారాలు తెరిచేవున్నాయంటున్న జనసేన!!
రహస్యాన్ని రహస్యంగానే ఉంచాలి. లేదంటే అది రహస్యమెలా అవుతుంది. అందుకే విశాఖపట్నంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ తామిద్దరి మధ్య అరగంట సమయం ఏం జరిగింది? ఏం చర్చించామనేది రహస్యంగానే ఉంచారు. దీనిపై మీడియాలో పలు కథనాలు వచ్చాయి. కానీ వాటిని జనసేనకానీ, బీజేపీకానీ సమర్థించనూ లేదు.. ఖండించనూ లేదు. ఎవరి ఊహకు వారిని వదిలేశారు.

కడప పర్యటనలో నాదెండ్ల మనోహర్
జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. ప్రధానమంత్రితో పవన్ కల్యాణ్ ఏం చర్చించారు? ఏం మాట్లాడారు? అనే విషయాన్ని ఎప్పటికీ రహస్యంగానే ఉంచుతామన్నారు. ఆ విషయాన్ని ఎవరితోను పంచుకోమని స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో రకరకాల వార్తలు వస్తున్నాయి కదా.. దీనిపై స్పందించమని మీడియా కోరగా అవన్నీ ఊహాగానాలేనని, పుకార్లని, వాటిని పట్టించుకోవద్దంటూ కుండబద్ధలు కొట్టారు.
వైసీపీ విముక్త ఏపీ కోసం అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధానితో పవన్ జరిపిన సమావేశాన్నితమ పార్టీ గౌరవిస్తుందన్నారు.

వైసీపీ విముక్త ఏపీకోసం వెనక్కి తగ్గేదే లేదు
ఏపీని వైసీపీ విముక్త రాష్ట్రంగా ఏపీని చేసే విషయంలో తాము వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని కూడా నాదెండ్ల స్పష్టం చేశారు. పొత్తులన్నవి ఎన్నికల సమయంలో చర్చించాలని, వాటిపై ఇప్పుడే మాట్లాడటం బాగుండదంటూ తెలుగుదేశం-జనసేన పొత్తుపై ఆశలు సజీవంగా ఉంచారు. టీడీపీ-జనసేన పొత్తు ఉండదని, ప్రధానమంత్రి టీడీపీతో కలవడానికి ఇష్టపడలేదని, బీజేపీ-జనసేన కలిసి ఎన్నికలకు వెళ్దామంటూ మోడీ చెప్పారని, అందుకే ఒంటరిపోరాటమంటూ మరోసారి పవన్ స్టేట్ మెంట్ ఇచ్చారంటూ రకరకాలుగా వస్తున్న వార్తలకు నాదెండ్ల మనోహర్ తన స్టేట్ మెంట్ ద్వారా చెక్ పెట్టారు. నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలను బట్టి టీడీపీ-జనసేన పొత్తులకు ద్వారాలు తెరిచే ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. అంతేకాకుండా పవన్ మోడీతో ఏం చర్చించారనేది మనోహర్ కు తెలుసు కాబట్టి ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారంటున్నారు.

అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి ఏడాది..
కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి సంవత్సరం అవుతున్నా ఆయా గ్రామాల ప్రజలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని మనోహర్ మండిపడ్డారు. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయిందని, ముఖ్యమంత్రి సొంత జిల్లాలో జరిగిన ఘోరంపై ఆయన పది రోజుల తర్వాత స్పందించారని నాదెండ్ల గుర్తుచేశారు. 3 నెలల్లో ఇంటి తాళాలు ఇస్తామన్న సీఎం జగన్ హామీ నెరవేరలేదని, ఎకరాకు రూ.12,500 ఇస్తామని చెప్పి ఇప్పటివరకు చిల్లిగవ్వ ఇవ్వలేదని ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications