"ప్రపంచంలోనే నెంబర్ 1 గా తెలుగు జాతి"
దుబాయ్ పర్యటనలో చివరి కార్యక్రమంగా గల్ఫ్ లోని తెలుగు ప్రజలతో డయాస్పోరా కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. గల్ఫ్ లోని యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఓమన్, బహ్రెయిన్, ఖతార్ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దుబాయ్ లోని లీ మెరిడియన్ హోటల్ లో అత్యంత ఉత్సాహ భరితంగా తెలుగు డయాస్పోరా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్ 1 గా తయారవుతుందని అన్నారు.
"తెలుగు జాతికి తిరుగే లేదు. ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్ 1 గా తయారవుతుంది. ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా తెలుగు ప్రజలు ఉన్నతస్థాయిలో ఉండాలని ఆకాంక్షించాను. 30 ఏళ్ల ముందు ఐటీని ప్రోత్సహించాను. తెలుగు వాళ్లు ఐటీ నిపుణులుగా ఇప్పుడు ప్రపంచం అంతా రాణిస్తున్నారు. సత్యనాదెళ్ల లాంటి తెలుగు వాళ్లు మైక్రోసాఫ్ట్ కంపెనీ సీఈఓగా ఉన్నారు. 2024 ఎన్నికల్లో కూటమి కోసం ప్రవాసాంధ్రులంతా తపించి గెలిపించారు" అని సీఎం చంద్రబాబు అన్నారు.

"గల్ఫ్ దేశాల నుంచి మీరు తరలివచ్చి తెలుగు డయాస్పోరాకు హాజరు కావటం ఆనందాన్ని కలిగిస్తోంది.అబుదాబీ, దుబాయ్ ఆయిల్ ఎకానమీ నుంచి పర్యాటకం, నాలెడ్జి ఎకానమీ దిశగా నడుస్తున్నాయి. 1.50 లక్షల హోటల్ రూములతో ఆతిథ్య రంగానికి పెద్ద ఎత్తున ఆదాయాన్ని ఆర్జించి పెడుతోంది. గతంలో హైదరాబాద్ కు మైక్రోసాఫ్ట్ తీసుకువస్తే ఇప్పుడు ఏపీలోని విశాఖకు గూగుల్ తీసుకువస్తున్నాం. దేశంలో క్వాంటం వ్యాలీ ఉండే ఏకైక ప్రాంతం కూడా ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ప్రతీ ఇంటికీ ఒక పారిశ్రామికవేత్తను తయారు చేసి లక్ష్యాన్ని సాధిస్తాం" అని సీఎం చంద్రబాబు అన్నారు.

"ఐటీ, కమ్యూనికేషన్ల రంగంలో విప్లవాత్మక మార్పులను అందిపుచ్చుకుంటున్నాం. సాంకేతికత ద్వారా పాలన అందించేలా వాట్సప్ ద్వారా 730కి పైగా పౌర సేవలు అందిస్తున్నాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా పెట్టుబడులు ఆకర్షిస్తున్నాం. 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో గూగుల్ విశాఖలో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోంది" అని సీఎం చంద్రబాబు తెలిపారు.












Click it and Unblock the Notifications