ఉగ్రవాదులకు సహకరిస్తుందెవరు, తెలుగు రాష్ట్రాలకు హెచ్చరిక: వెంకయ్య
హైదరాబాద్: నల్గొండ జిల్లా జానకీపురం వద్ద శనివారం ఎన్‌కౌంటర్‌లో గాయపడి ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీఐ, ఎస్సైలను కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, బండారు దత్తాత్రేయ, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పరామర్శించారు.
ఎస్సై సిద్దయ్యకు వైద్యులు సమన్వయంతో శస్త్ర చికిత్స చేశారన్నారు. 72 గంటల తర్వాత సిద్ధయ్య ఆరోగ్య పరిస్థితి చెబుతామని డాక్టర్లు చెప్పారని, కానిస్టేబుల్ నాగరాజు మృతి బాధాకరమన్నారు. శత్రువులతో వీరోచితంగా పోరాడిన పోలీసు సిబ్బందిని అభినందిస్తున్నామన్నారు.

ఉగ్రవాద నిర్మూలనకు ఎలాంటి సహకారం కావాలన్నా కేంద్రం ఇస్తుందన్నారు. తెలుగు రాష్ట్రాల పోలీసులు పరస్పరం సహకారంతో పని చేయాలన్నారు. నల్గొండ ఎన్ కౌంటర్ తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని వెంకయ్య నాయుడు అన్నారు. ఈ ఘటనలో బాధిత కుటుంబాలకు సాయమందిస్తామన్నారు.
అవసరమైతే ఎన్ఐఏతో దర్యాఫ్తు జరిపిస్తామన్నారు. ఉగ్రవాదులకు సహకరిస్తున్న శక్తులను గుర్తించాలన్నారు. పోలీసులకు అత్యాధునిక ఆయుధాలు అందించాలన్నారు. ఇది అంతర్రాష్ట్ర సమస్య అని, అన్ని కోణాల్లో దర్యాఫ్తు చేయాలన్నారు.

మావోయిస్టుల కదలిక కొంత తగ్గాక తెలుగు రాష్ట్రాల్లో నిఘా కొంచెం తగ్గిందన్నారు. దీనిని హెచ్చరికగా తీసుకొని తెలుగు రాష్ట్రాలు పని చేయాలన్నారు.
అత్యాధునిక ఆయుధాలు లేకపోవడం వల్లనే పోలీసులు ప్రాణాలు కోల్పోవలసి వచ్చిందని కిషన్ రెడ్డి అన్నారు. నాగరాజు అందుకే ప్రాణాలు కోల్పోయారన్నారు. ఈ కేసు దర్యాఫ్తును ఎన్ఐఏకు అప్పగించాలన్నారు. సరైన ఆయుధాలు లేక పోలీసులు ఇబ్బంది పడ్డారన్నారు. గత ప్రభుత్వాల ఉదాసీనత వల్ల ముగ్గురు పోలీసులను కోల్పోయామన్నారు.












Click it and Unblock the Notifications