అమరావతి కేంద్రంగా బాలయ్య మార్క్ నిర్ణయం - రేపే ముహూర్తం..!!
నందమూరి బాలకృష్ణ కీలక నిర్ణయం తీసుకున్నారు. అమరావతి వేదికగా కీలక ఘట్టానికి శ్రీకారం చుడుతున్నారు. ఇందుకు రేపు (బుధవారం) ముహూర్తం ఖరారు చేసారు. అమరావతి రాజధానిగా ఖరారు చేసిన తరువాత నందమూరి బాలకృష్ణ అక్కడ బసవ తారకం కేన్సర్ ఆస్పత్రి నిర్మాణానికి నిర్ణయించారు. ఇందు కోసం సీఆర్డీఏ ఇప్పటికే 21 ఎకరాల భూమి కేటాయించారు. కాగా, ఇప్పుడు నిర్మాణం ప్రారంభించి.. దశల వారీగా ఆస్పత్రి నిర్మించాలని డిసైడ్ అయ్యారు.
అమరావతి కేంద్రంగా తుళ్లూరులో బసవ తారకం కేన్సర్ ఆస్పత్రి నిర్మాణానికి నందమూరి బాలకృష్ణ దంపతులు శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఈ కార్యక్రమానికి హాజరవుతారని సమాచారం. ఇప్పటికే తమ ఆస్పత్రికి కేటాయించిన భూమి ప్రాంగణాన్ని నందమూరి బాలకృష్ణ పరిశీలించారు. అనంతరం భవన నిర్మాణ సంస్థలు, సిఆర్‌డిఎ ప్రతినిధులతో చర్చించారు. ఆస్పత్రి నిర్మాణం మొత్తం మూడు దశల్లో పూర్తి చేయనున్నట్టు సిఆర్‌డిఎ అదనపు కమిషనర్ ప్రవీణ్‌కు ఎమ్మెల్యే వివరించారు. నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలపై కీలక సూచనలు చేశారు. రోగులకు అధునాతన వైద్యం అందించే దిశగా నిర్మాణాన్ని తీర్చి దిద్దుతామని తెలిపారు.

2014-19లో అప్పటి టిడిపి ప్రభుత్వ కేన్సర్ ఆస్పత్రి నిర్మాణానికి 21 ఎకరాలను కేటాయించింది. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నిర్మాణ పనుల ఊసే లేకుండా పోయింది. టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆస్పత్రి నిర్మాణానికి మరో ఆరు ఎకరాలు కేటాయించారు. దీంతో బాలకృష్ణ ఆస్పత్రి స్థలాన్ని పరిశీలించారు. ఆ ప్రాంతంలో హెచ్‌టి విద్యుత్ లైన్‌లు అడ్డుగా ఉన్నాయని, వాటిని తొలగిస్తే ఆస్పత్రి నిర్మాణ పనులు ప్రారంభించేందుకు వీలుగా ఉంటుందన్న బాలకృష్ణ విజ్ఞప్తి మేరకు సిఆర్‌డిఎ అధికారులు ట్రాన్క్‌కోకు లేఖ రాశారు. దీంతో హెచ్‌టి విద్యుత్ లైన్‌లను తొలగించారు.
ఈ ఆసుపత్రి ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా పనిచేస్తుందని బాలయ్య చెప్పారు. 21 ఎకరాల విస్తీర్ణంలో మూడు దశల్లో ఈ ఆసుపత్రి నిర్మాణం జరగనుందని స్పష్టం చేశారు. తొలి దశలో క్యాన్సర్ నిర్ధారణ, డే కేర్ విభాగాలు ప్రారంభమవుతాయని తెలిపారు. రెండో దశలో కిమోథెరపీ, సర్జరీ, రేడియేషన్ విభాగాలు.. మూడో దశలో పరిశోధన, శిక్షణ, అంతర్జాతీయ చికిత్స విభాగాలను ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. ఈ ఆసుపత్రి ప్రైవేట్-పబ్లిక్ భాగస్వామ్యంతో ఒక సేవా కేంద్రంగా పనిచేస్తుందని బాలయ్య వివరించారు. భవిష్యత్తులో దీన్ని వెయ్యి పడకలకు విస్తరించనున్నారు. దీనికి అనుబంధంగా మెడికల్ కాలేజీ నిర్మాణం చేపడతామని వెల్లడించారు.












Click it and Unblock the Notifications